నేత‌ల ‘అతి’ వైసీపీ కొంప ముంచుతోందా!

నేత‌లు త‌మ త‌మ స్థాయిని గుర్తించి వ్య‌వ‌హరించాలి. అది ఏ పార్టీ అయినా.. నాయ‌కుల తీరులో స్ప‌ష్ట‌త‌.. చేసే ఆరోప‌ణ‌ల‌కు ప్రాధాన్యం తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాలి. కానీ.. వైసీపీలో విజ్ఞ‌త‌లేని నాయ‌కులు చేస్తున్న అతి కార‌ణంగా.. ఆ పార్టీ పుట్టి మునిగిపోతోంది. అస‌లు ఆ పార్టీ అధినేత‌కే విజ్ఞ‌త లేద‌ని అనే వారు కూడా ఉన్నారు. స‌రే.. తాజాగా పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. స‌హ‌జంగానే ఈ ఓటమి.. వైసీపీ నేత‌ల్లో అక్క‌సుపెంచింది. ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌త్తెన‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. మ‌రో అడుగు ముందుకు వేసి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎక్క‌డో ప‌శ్చిమ బెంగాల్ లో ఏడాది కింద‌ట జ‌రిగిన ఓ స్థానిక ఎన్నిక‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో.. ఓ యువ‌కుడు భారీ ఎత్తున రిగ్గింగుకు పాల్ప‌డుతున్నాడు. దీనిని పులివెందుల‌లోనే జ‌రిగిన‌ట్టుగా అంబ‌టి పేర్కొన్నారు. అంతేకాదు.. ఇది “కోయ ప్ర‌వీణ్ ఐపీఎస్‌కు అంకితం” అంటూ కామెంట్ చేశారు.

అయితే.. దీని పూర్వాప‌రాలు తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు.. సోష‌ల్ మీడియాలో వైసీపీని ఏకేశారు. ఇక , పులివెందుల‌కే చెందిన వైసీపీ నాయ‌కుడు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా.. మ‌రోకీల‌క వ్యాఖ్య చేసి.. విమ‌ర్శ లు ఎదుర్కొన్నారు. 6 వేల మెజారిటీ వ‌చ్చిన‌.. ల‌తా రెడ్డి(టీడీపీ అభ్య‌ర్థి).. ఓటు వేసిన వారి వేళ్ల‌కు ఇంకు చూపించ‌గ‌ల‌రా? అని స‌వాల్ రువ్వారు. కానీ, ఇది బెడిసికొట్టింది. దీనిపై ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. అలానే.. ఇత‌ర నాయ‌కులు కూడా.. ఒంటిమిట్ట ఉప పోరుపై వ్యాఖ్య‌లు చేయ‌గా.. వాటిని ఎన్నిక‌ల అధికారులే ఖండించారు. మొత్తంగా నేత‌ల అతి.. వైసీపీకి క‌లిసి రాక‌పోగా.. మ‌రింత విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.