పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!

దాయాది దేశం పాకిస్థాన్‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. మూడు కీల‌క అంశాల‌పై ఆయ‌న స్పందిస్తూ.. ఈ విష‌యాల్లో పాక్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 79వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శుక్ర‌వారం ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

1) సింధు జలాల అంశంపై మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి చ‌ర్చ‌లు ఉండ‌బోని ప్ర‌ధాని తెగేసి చెప్పారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. సింధు న‌ది జ‌లాల‌ను.. భార‌త్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు మ‌ళ్లించి.. రైతులు, ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరు అందించాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలోనూ ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తిరిగి స‌మీక్షించే ప్ర‌సక్తి కూడా లేద‌న్నారు.

2) ఆప‌రేష‌న్ సిందూర్: ఈ విష‌యంలో భార‌త్ రాజీప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదం విష‌యంలో భార‌త్ రాజీ ప‌డ‌బోద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చే దేశాలను… అడుక్కుతినేలా చేస్తామ‌ని ప‌రోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పహల్గాంలో మతం పేరుతో దారుణానికి తెగ‌బ‌డ్డ ఉగ్రవాదులకు ఆప‌రేష‌న్ సిందూర్‌తో గట్టి గుణపాఠం చెప్పామ‌ని.. సిందూర్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

3) బెదిరింపులు: దాయాది దేశం బెదిరింపుల‌పై స్పందించిన ప్ర‌ధాని.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడబోద‌న్నారు. భ‌య‌ప‌డ‌డానికి 140 కోట్ల మంది ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న ప్ర‌ధాని.. భార‌త్ జోలికి వ‌స్తే.. ఏకాకుల‌వుతార‌ని పాకిస్థాన్‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.