వివేకా హత్య సీబీఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇక, జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కడప ఎస్పీ అశోక్ కుమార్ ను వివేకా తనయురాలు సునీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లుగా సంతకం చేయాలంటూ అప్పట్లో తన దగ్గరకు ఒక లేఖ తచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ, తాను ఆ లేఖపై సంతకం చేయలేదని గుర్తు చేసుకున్నారు.
ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనల గురించి ఎస్పి అశోక్ కుమార్ తో సునీత భేటీ అయ్యారు. ఈ ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తుందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలిపోటుతో తన తండ్రి వివేకా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారని, కానీ దానిని గుండెపోటు అని చెప్పారని సునీత గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు హత్య చేశారని నమ్మబలికారని, పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచివేశారని ఆరోపించారు.
వివేకా హత్య సమయం నాటి పరిస్థితులు ఇప్పుడు జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో కనిపిస్తున్నాయని అన్నారు. తమ బంధువు సురేష్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయించారని అనుమానం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా వివేకా హత్య కేసు విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నానని, ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకాను తాను, తన భర్త చంపించినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates