‘సీఎం ఫొటో’పై ర‌గ‌డ‌.. 10 ల‌క్ష‌లు వ‌దిలించుకున్న ఎంపీ!

రాజ‌కీయాల‌కు కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎక్క‌డ విమ‌ర్శించాలో.. ఎక్క‌డ త‌గ్గి ఉండాలో నాయ‌కులు తెలుసుకోవాలి. అంతేకానీ .. ప్ర‌తి విష‌యాన్నీ.. రాజ‌కీయం చేస్తే.. ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుందో.. త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే ఎంపీ ష‌ణ్ముగంకు సుప్రీంకోర్టు భారీ స్థాయిలో స‌మాధానం చెప్పింది. ఇది దేశ‌వ్యాప్తంగా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు వ‌ర్తించే తీర్పు కావ‌డం గ‌మ‌నార్హం. అందుకే తాజాగా జ‌రిగిన ఈ వ్య‌వ‌హారానికి దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. భ‌విష్య‌త్తులో ప్ర‌తిప‌క్షాలు ఎలా వ్య‌వ‌హ‌రించాలో కూడా తాజా తీర్పు నిర్దేశించింది.

ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌..’విత్ యూ స్టాలిన్‌'(మీతో స్టాలిన్‌) అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. స‌హ‌జంగా ఆయ‌న ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి.. ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది కాబ‌ట్టి.. దీనికి సంబంధించిన ప్ర‌చార పోస్ట‌ర్లు.. ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్య‌మంత్రిగా త‌న ఫొటోను వేసుకున్నారు. అయితే.. దీనిని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా నిర‌సించాయి. త్వ‌ర‌లోనే ఈ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తే.. ప్ర‌తిప‌క్షాలుగా త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని భావించారో ఏమో.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అన్నాడీఎంకే మ‌రింత యాగీ చేసింది. ముఖ్య‌మంత్రి ఫొటోలు వేసుకునేందుకు వీల్లేదంటూ.. పెద్ద చ‌ర్చ చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలోనే అన్నాడీఎంకే రాజ్య‌స‌భ స‌భ్యుడు ష‌ణ్ముగం.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ముఖ్య‌మంత్రి ఫొటోతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌ని.. దీనిని నిలువ‌రించాల‌ని కోరారు. దీనిని విచారించిన హైకోర్టు.. ఆయ‌న‌కు అనుకూలంగా ప్ర‌బుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చింది. జూలై 31న ఇచ్చిన ఆదేశాల్లో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్య‌మంత్రుల పేర్లు, వారి ఫొటోలు ఉండ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఇది కూడా అప్ప‌ట్లో దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక ప్ర‌భుత్వ అధినేత గా ఉన్న సీఎం ఫొటోలు వేస్తే త‌ప్పేంట‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. దీనినే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సుప్రంకోర్టులో స‌వాల్ చేసింది.

దీనిని విచారించిన సుప్రీంకోర్టు బుధ‌వారం.. సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌హా.. ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌ధాని స‌హా ముఖ్య‌మంత్రుల పేర్లు వినియోగించ‌డం.. వారి ఫొటోలు వాడ‌డం కామనేన‌ని తేల్చి చెప్పింది. కానీ, ష‌ణ్ముగం మాత్రం కోర్టుల‌ను రాజ‌కీయ వేదిక‌గా చేసుకుని పొలిటిక‌ల్ ఫైట్ చేయాల‌ని అనుకున్నార‌ని వ్యాఖ్యానించింది. అస‌లు ఆయ‌న వేసిన పిటిష‌న్‌లో ప‌స లేద‌ని.. అర్ధ‌ర‌హిత‌మ‌ని, అన‌వ‌స‌ర‌మ‌ని.. వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలోనే మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఇదే స‌మ‌యంలో షణ్ముగంకు రూ.10 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. దీనిని పేద‌ల సంక్షేమానికి వినియోగించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి తేల్చి చెప్పింది. మొత్తంగా ఈ తీర్పు.. దేశ‌వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వాల‌కు వ‌ర్తించేలా ఉండ‌డం గ‌మ‌నార్హం.