12 పెట్టెల్లో 11 కోట్లు… :  లిక్క‌ర్ స్కామ్‌లో `సిట్` సీజ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు అమ‌లు చేసిన మ‌ద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభ‌కోణం అని దీనిని విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచార‌ణ‌కు చేప‌ట్టి 9 మాసాల‌కుపైగానే అవుతోంది. ఒక‌వైపు అరెస్టులు.. జ‌రుగుతూనే ఉన్నాయి.. మ‌రోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విష‌యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్ర‌మాలు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి.

తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 12 అట్ట‌ పెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఏ-40 నిందితుడుగా ఉన్న వ‌రుణ్ అనే వ్య‌క్తిని విచారించిన సిట్ అధికారులు.. అత‌ను ఇచ్చిన స‌మాచారం ఆధారంగా హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో.. 12 అట్ట‌పెట్టెల్లో దాచిన  11 కోట్ల రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నిధుల‌ను ఈ కేసులో ప్ర‌థ‌మ నిందితుడుగా ఉన్న ఏ-1 క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉర‌ఫ్ రాజ్ క‌సిరెడ్డి ఆదేశాల‌తోనే తాను దాచిపెట్టాన‌ని వ‌రుణ్ అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. ఇదే విష‌యాన్నిఈ కేసులో మ‌రో నిందితుడు బూనేటి చాణ‌క్య కూడా చెప్పార‌ని స‌మాచారం. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ర‌లిస్తుండ‌గా.. నిఘా ఎక్కువ కావ‌డంతో హైద‌రాబాద్‌లోని శంషాబాద్ మండ‌లంలో ఉన్న కాచారం ఫామ్ హౌస్‌లో దీనిని దాచి పెట్టిన‌ట్టు వారు వెల్ల‌డించారు.  దీంతో సిట్ అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.