ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చు.. 370 కోట్ల పైచిలుకుగా ఉందని.. కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చౌధరి.. లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వివరించారు. ఇది.. గత ఐదేళ్లకు సంబంధించిన ఖర్చు అని ఆయన తెలిపారు. 2021-25(మార్చి 31) వరకు చేసిన ఖర్చుగాఆయన పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో మొత్తం 33 దేశాలకు ప్రధాని వెళ్లారని తెలిపారు.
ఆయా దేశాల్లో బస చేసినందుకు.. కానుకలు ఇచ్చినందుకు.. రవాణా చార్జీలు.. ఇతర భత్యాలు కలుపుకొని 370 కోట్లకు పైగానే ఖర్చు అయిందని పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి విదేశాలకు వెళ్తే.. దేశ ప్రజలు వెళ్లినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. “142 కోట్ల మంది ప్రజల తరఫున ప్రధాని ప్రతినిధిగా ఆయా దేశాలకు వెళ్లారు. ఆయన ఈ దేశ గౌరవాన్ని.. ప్రతిష్టను విదేశీ గడ్డపై నిలబెట్టాల్సి ఉంది. ఈ ఖర్చును పెద్దదిగా చేసి చూపేందుకు ప్రయత్నించడం సరికాదు.“ అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలు ప్రతి విషయాన్నీ యాగీ చేస్తున్నాయని పంకజ్ చౌధరి అన్నారు. రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన నాయకులు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు.. ఇంకా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పొదుపు పాటిస్తారని.. అందుకే ఖర్చు చాలా తక్కువ పెట్టారని ఆయన చెప్పడం లోక్‌సభలో నవ్వులు పూయించింది. విపక్ష సభ్యులు పగలబడి నవ్వేలా చేసింది.
ఇక, అమెరికాలో ఒక్కరోజు పర్యటన కోసం.. 18 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి వివరించారు. అలాగే.. ఈ ఏడాది తాజాగా చేసిన బ్రిటన్, థాయ్‌లాండ్ పర్యటనల ఖర్చును దీనిలో చేర్చలేదని తెలిపారు. విదేశాలకు వెళ్లినప్పుడు.. అధికారులకు భత్యాలు ఇచ్చే సంప్రదాయం ఉందని.. ప్రధాని మోడీ పర్యటనను కవర్ చేసే మీడియాకు కూడా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని.. ఇవన్నీ.. కలిపి 370 కోట్ల వరకు ఖర్చయిందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates