గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మొత్తం ప్రక్రియ కేవలం 20 రోజుల్లోనే ముగియనుంది. అయితే, ఈ దఫా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చిత్రమైన రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ కు దుబ్బాక ఉప పోరులో గట్టి ఎదురు దెబ్బతగలడం.. పుంజుకుంటుందా? అనే సందేహాల నుంచి బీజేపీ దుబ్బాకలో పాగా వేయడం వంటివి ఆసక్తికర అంశాలు. ఇప్పుడు జీహెచ్ఎంసీలోనూ ఈ రెండు పార్టీలే ప్రధానంగా తలపడు తున్నాయి. అయితే, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన దారి ఎటు? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
గ్రేటర్ ఎన్నికల్లో సత్తాచాటి.. టీఆర్ ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న నేప థ్యంలో బలమైన మిత్రపక్షమని భావిస్తున్న జనసేనతో కలిసి బరిలో దూకే పరిస్థితి కనిపించడం లేదు. ఇటు బీజేపీ.. ఇప్పటికే..తాము ఒంటరిగా పోటీ చేస్తామని..తమతో పొత్తుకు ఎవరూ సంప్రదించలేదని.. పరో క్షంగా జనసేనను ఉద్దేశించి ప్రకటించేసింది. కొన్నాళ్ల కిందట .. పవన్ కూడా ఇదే ప్రకటన చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. సుమారు 50 కార్పొరేట్(వార్డు) స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు. దీంతో పవన్ ప్రభావంపై ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజానాడిని పరిశీలిస్తే.. ఇక్కడ సెటిలర్లు ఎక్కువ. ప్రధానంగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్నారని అంచనా. వీరిలోనూ పవన్ సామాజిక వర్గమైన కాపు కులానికి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అదేసమయంలో పవర్ స్టార్‌కు వీరాభిమానులు, అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. దీంతో పవన్ పార్టీపై ఆశలు మెండుగానేఉన్నాయి. గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక సమరంలో పవన్ పార్టీ ఓటమి పాలైంది. స్వయంగా ఆయన రెండు చోట్ల పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఈ సింపతీ ఇప్పుడు గ్రేటర్ లో కనిపించే అవకాశం ఉందా? అనేది ప్రశ్న.
అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నా.. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే.. మాత్రం ఆ పార్టీతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఇక, అదికార పార్టీ టీఆర్ఎస్కు సానుకూలం గా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పవన్ పార్టీని గెలిపిస్తే… తమ సమస్యలపై ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని సెటిలర్లు భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. దీనిలోనూ కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రశ్నిస్తానన్న ఏపీలో ఇప్పుడు మౌనం పాటించడాన్ని గ్రేటర్ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి తటస్థ ఓటు పడే అవకాశం ఉంది. ఇక, యువత ఓట్లు పవన్‌కేననే ప్రచారం అప్పుడే జోరందుకుంది.
ఏపీ నుంచి వచ్చి.. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు, యూనివర్సిటీల్లో ఉన్నవారు.. పవన్కుమొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే..ఇదంతా కూడా.. ప్రచారం.. రాజకీయ పార్టీల హామీల వరద వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందనే విశ్లేషణలు వస్తుండడం గమనార్హం. మరి పవన్ పుంజుకుంటారో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates