బీఆర్ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం మరింత ముదిరింది. రాష్ట్రంలో సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు తెలంగాణ జాగృతి మాత్రమే ముందుకు వస్తోందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘లీడర్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనికి సంబంధించి కొన్ని మార్పులు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్లో ఎక్కడా బీఆర్ఎస్ జెండా కానీ.. గులాబీ రంగులు కానీ.. కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద పోస్టర్లపై కేసీఆర్ ఫొటో, ఆ పక్కన ప్రొఫెసర్ జైశంకర్ ఫొటోలకు మాత్రమే చోటు కల్పించారు.
మరి కేటీఆర్ ఫొటో ఏమైనట్టు? అనేది సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. జాగృతి తరఫున పోరాటాలు బలోపేతం చేస్తామని చెప్పిన కవిత.. తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా బీఆర్ఎస్ పేరును ప్రస్థావించక పోవడం కూడా విశేషం. వాస్తవానికి కవిత తన సోదరుడు కేటీఆర్‌తో విభేదిస్తున్నా.. కేసీఆర్, బీఆర్ఎస్‌ల పేర్లను తరచుగా ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. అనంతరం జరిగిన దాడి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉండడం వంటి పరిణామాలతో కవిత పూర్తిగా యూటర్న్‌తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అంటే.. దాదాపు కవిత ఇక, ఒంటరి పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ‘లీడర్’ కార్యక్రమంలో కేసీఆర్ ఫొటో మాత్రమే(అది కూడా చాలా చిన్నది).. పెట్టి కేటీఆర్ ఫొటోకానీ.. ఆయన పేరును కానీ.. ప్రస్తావించకపోవడం.. ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ఇక, తన ప్రసంగంలో కేవలం జాగృతి మాత్రమే పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలపై జాగృతి మాత్రమే ఉద్యమిస్తోందని.. ప్రభుత్వాన్ని నిలదీస్తోందని వ్యాఖ్యానించారు. తద్వారా బీఆర్ఎస్ ను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ అస్థిత్వాన్ని కవిత ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ యాసను తిట్టిపోయిన వారికి, ఆ భాషను విమ ర్శించిన వారికి తాజాగా అవార్డులు ఇచ్చారన్న ఆమె.. ఈ వ్యవహారంలోనూ .. తాను మాత్రమే పోరాడానని సెల్ఫ్ గోల్ చేసుకు న్నారు. అంటే.. ఇక, తెలంగాణ కోసం పోరాడేది.. నిలిచేది కూడా తానేనని ఆమె పరోక్షంగా ప్రచారం చేసుకున్నట్టు అయింది. ఈ పరిణామాలను గమనిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి.. కవిత.. సింగిల్ జెండా.. అజెండాను రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా తెరమీదికి వస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates