ఏపీ టూరిజం శాఖ‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీలోని కూట‌మి స‌ర్కారుకు కీల‌క అవార్డు ద‌క్కింది. 10వ ఇంట ర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ ఏపీలో చేప‌డుతున్న ప‌ర్యాట‌క ప్రాజెక్టులు.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలించి.. ‘ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డు’ను రాష్ట్రానికి ప్ర‌క‌టించింది. ఈ నెల 26(శ‌నివారం)న ఢిల్లీలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ప‌ర్యాట‌క అభివృద్ది కార్పొరేష‌న్‌(ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, ఐఏఎస్ అధికారి ఆమ్ర‌పాలి కాట‌కు అందించ‌నుంది. ఈ విష‌యాన్ని ఆమ్ర‌పాలి ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఎలా ద‌క్కింది?

దేశంలోనే అత్యంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న 2వ‌ రాష్ట్రంగా ఏపీ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని వినియోగించుకుని.. ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేసేందుకుస‌ర్కారు న‌డుంబిగించింది. ఈ క్ర‌మంలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసింది. ‘అఖండ గోదావ‌రి’ ప్రాజెక్టు ద్వారా.. రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క రంగంలో ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది.

అదేస‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్యాట‌క శాఖ‌కు ‘ప‌రిశ్ర‌మ‌’ హోదా కూడా క‌ల్పించారు. త‌ద్వారా రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగం ద్వారా.. ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌తో పాటు.. ఆదాయం కూడా పెరుగుతుందని అంచ‌నా వేశారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వినూత్న విధానాలు, కొత్త పాలసీలు, విప్లవాత్మక సంస్కరణలకు ఆయ‌న పెద్ద‌పీట వేస్తున్నారు.

వీట‌న్నింటిని గ‌మ‌నించిన ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ‌.. ఈ సారి అవార్డుకు ఏపీని ఎంపిక చేసిన‌ట్టు ఐసీఎం గ్రూప్ ఎండీ, ఛైర్మన్ అజయ్ గుప్తా, ఐటీసీటీఏ జ్యూరీ సభ్యులు తెలిపారు. కాగా.. ఈ అవార్డుతో రాష్ట్ర ప‌ర్యాట‌కం మ‌రింత పుంజుకునేందుకు.. విదేశీ ప‌ర్యాట‌క‌లు కూడా రాష్ట్రానికి మ‌రింత పెరిగేందుకు అవ‌కాశం ఉంద‌ని ఆమ్ర‌పాలి కాట పేర్కొన్నారు.