50 వేల కావాలా.. అయితే ఈ ప‌నిచేయండి: ఏపీ ప్ర‌భుత్వం

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం జ‌నాభా పెంపుద‌ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జ‌ల‌కు సీఎం ప‌దే ప‌దే పిల్ల‌ల‌ను క‌నాల‌ని గ‌త ఏడాది కాలంగా చెబుతున్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న ప‌న్నుల వాటా జ‌నాభా ప్రాతిప‌దిక‌నే ఉండ‌డం, జ‌నాభా ఆధారంగానే భ‌విష్య‌త్తులోనూ ఇదే ప్రాతిప‌దిక‌న నిధులు కేటాయింపు జ‌రుగుతుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టితో ఈ ప్ర‌తిపాద‌న చేశారు. ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నా రు. అయితే.. ప్ర‌జ‌ల్లో ఆమేర‌కు చైతన్యం రాలేదు. దీంతో ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా జ‌రిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో జ‌నాభా పెరుగుద‌ల‌పై కూడా సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌తో చ‌ర్చించారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీకి సంబంధించిన‌ ముసాయిదా సిద్ధ‌మ‌వు తోంద‌న్న సీఎం.. దీనిపై అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యం లో ప్ర‌భుత్వం వైపు నుంచి ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించారు.

ఇవీ.. ప్రోత్సాహ‌కాలు..

1) ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు.
2) ప్ర‌భుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చేసే మ‌హిళ‌ల‌కు ప్రసూతి వేత‌నంతో కూడిన సెలవులు ఏడాది పాటు ఇస్తారు.
3) పురుషుల‌కు కూడా కుటుంబ నిర్వ‌హ‌ణ సెల‌వుల పేరుతో.. 6-8 నెల‌లు వేత‌నంతో కూడిన సెల‌వులు ఇస్తారు.
4) ఆత‌ర్వాత‌.. ఏడాది పాటు.. బాలింత‌ల‌కు.. వ‌ర్క్ ఫ్రం హోం స‌దుపాయం క‌ల్పిస్తారు.
5) మూడో బిడ్డ నుంచి ఎంత మంది పిల్ల‌ల‌ను కంటే.. అంద‌రికీ.. త‌ల‌కు రూ.50 వేల చొప్పున ఆ కుటుంబ ఖాతాలో బిడ్డ పుట్టిన రోజే ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంది.
6) ఐవీఎఫ్ ద్వారా పిల్ల‌ల‌ను క‌నేవారికి కూడా ప్ర‌భుత్వం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది. ఇదిఎంత అనేది త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తారు.
7) ముగ్గురుకి మించి పిల్ల‌లు ఉన్న త‌ల్లుల‌కు.. రాష్ట్రంలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా.. ఐదేళ్ల‌పాటు ఉచితంగా ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ప్ర‌త్యేక ఆర్టీసీ బ‌స్ పాస్‌(ల‌గ్జ‌రీ బ‌స్సులు) ఇస్తారు.