వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి కేసుల ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారు. ఈ క్రమంలో మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్న అధికారులు మరో మాజీ మంత్రి, ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు అనిల్ కుమార్ పాత్ర కూడా ఉందని గుర్తించారు.
క్వార్ట్జ్ కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. క్వార్ట్జ్ గనుల లీజు ముగిసిన తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్టు శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. టన్నుకు వెయ్యి రూపాయల చొప్పున తనకు ఇచ్చారనీ, మిగిలిన సొమ్ము వారు తీసుకున్నారని వివరించాడు. ఈ క్వార్ట్జ్‌ను చైనాకు తరలించినట్టు శ్రీకాంత్ రెడ్డి వివరించాడు. ఈ సొమ్ముతో గూడూరు, నాయుడుపేట ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్టు తెలిపాడు. అలాగే హైదరాబాద్‌లోనూ రియల్ ప్రాజెక్టులు చేపట్టినట్టు వివరించాడు.
దీంతో క్వార్ట్జ్ కేసులో మాజీ మంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అనిల్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన పాత్రపై మరింత సమాచారం సేకరించిన తర్వాత నోటీసులు ఇస్తామని, కేసును వేగవంతం చేస్తామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ కేసులో మొత్తం రూ.200 కోట్లు చేతులు మారినట్టు గుర్తించిన అధికారులు.. దీనిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్రనే ఇప్పటివరకు గుర్తించగా, తాజాగా శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్‌పై కూడా కేసుకు రెడీ అవుతున్నారు.
2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారు. అదే సమయంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌పైనూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తొడగొట్టి మరీ టీడీపీ నాయకులకు ఆయన సవాళ్లు విసిరారు. అసెంబ్లీలో మంత్రి అయిన ఆయన మీసం మెలేసి పోలవరం పై ప్రకటనలు చేశారు. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టుగా.. గత ఎన్నికల్లో అనిల్ కుమార్‌ను జగన్.. నరసరావుపేట నుంచి ఎంపీగా నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. ఇటీవల మళ్లీ తెరమీదకు రావడం ప్రారంభించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates