ఆయన మాజీ మంత్రి. ఒకప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతాలు లభించాయి. అంతేకాదు, పార్టీలోనూ కొన్నాళ్లపాటు ఆయన షార్ప్ షూటర్‌గా వ్యవహరించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు.
కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందనే ఆవేదనలో ఉన్నారు. ఆయనే విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తాజాగా ఆయన అంతర్గత సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా పార్టీ నాయకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఈ క్రమంలో భీమిలిలోనూ ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్యే గంటా ఇటీవల ప్రయత్నించారు. కానీ అధికారులు ఎవరూ కూడా రాలేదన్నది ఆయన ఆవేదన. అంతేకాదు, తాను చెప్పిన తర్వాత కూడా పనులు చేయడం లేదన్నది ఎమ్మెల్యే ఆవేదన.
అందుకే ఆయన ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలోనూ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ముఖ్యంగా కూటమిలోని పార్టీల్లో ఉన్న కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో మాజీ మంత్రి హర్టవుతున్నారన్నది సత్యం.
బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగా ఫిర్యాదులు చేయడం, విమర్శలు చేయడం వంటివాటిని గంటా జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్నాళ్ల కిందట కూడా ఇరువురి మధ్య క్రికెట్ అసోసియేషన్ సహా భూములకు సంబంధించిన వివాదాలు తెరమీదకు వచ్చాయి. అప్పట్లో నడిరోడ్డుపైనే ఇరువురు నాయకులు వాదించుకున్నారు.
ఆ తర్వాత ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటారని గంటా శ్రీనివాసరావు భావించారు. కానీ ఈ వ్యవహారంపై ప్రభుత్వ పక్షాన ఎవరూ జోక్యం చేసుకోలేదు. అప్పటి నుంచి గంటా సీరియస్ పాలిటిక్స్‌ను పక్కన పెట్టారు.
ఇక ఇప్పుడు అధికారులు కూడా తనను పట్టించుకోవడం లేదని, తాను చెప్పిన పనులు కూడా కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మౌనంగా ఉండిపోతున్నారని విశాఖ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates