టీడీపీకి చెందిన కీలక నాయకుల్లో కొందరికి ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో ఉద్ధండ నాయకులు చాలా మంది ఉన్నా.. కొన్నాళ్లుగా ఇద్దరు ముగ్గురి పేర్లు బాహాటంగా తెరమీదికి వచ్చాయి. వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు మరింత ప్రముఖంగా వినిపించాయి. ఇక, పూసపాటికి గవర్నర్ పదవి దక్కింది. ఆయన తాజాగా పార్టీకి కూడా రిజైన్ చేశారు. త్వరలోనే గోవా గవర్నర్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పదవీ కాలం పూర్తికావడంతో కొనసాగిస్తారని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పదవి ఇస్తారన్న ఆశతో యనమల ఎదురు చూస్తున్నారు. గవర్నర్ పోస్టులను ప్రకటించిన సమయంలోనూ ఆయన ఎదురు చూసిన విషయం తెలిసిందే.
కానీ, మూడు రాష్ట్రాలకు గవర్నర్లను ప్రకటించినా.. ఒక్కరికి మాత్రమే ఏపీ నుంచి అవకాశం వచ్చింది. ఇక ఇప్పుడు యనమల వంతు వెయిటింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా గవర్నర్ పోస్టు వస్తుందా? లేక మరో నాలుగు మాసాల్లో జరిగే పెద్దల సభ ఎన్నికల్లో ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాజ్యసభకు పంపించాలని అనుకున్నా.. ఇప్పట్లో ఎన్నికలకు అవకాశం లేదు. పెద్దల సభకు వెళ్లేందుకు చాలా నెలలు ఎదురు చూడాలి.
ఈ క్రమంలో మరోసారి జరగనున్న గవర్నర్ పోస్టుల షఫిలింగులో యనమలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇదే విషయంపై నాయకులు చర్చించడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకుల్లో ఒక్క యనమలకే మాత్రమే పదవి ఇవ్వాల్సి ఉందని వారు చెబుతున్నారు. మిగిలినవారిలో కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారని.. మరికొందరికి నామినేటెడ్ పదవులు దక్కాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో యనమల వ్యవహారం ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates