బాబా మ‌జాకా.. పీ-4 సాధ‌న‌లో మైలు రాయి!

వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు పీ-4 మంత్రాన్ని జ‌పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకునేందుకుముందుకు రావాల‌ని పారిశ్రామిక‌, ధ‌నిక వ‌ర్గాల‌కు విన్న విస్తున్నారు. తాజాగా ఈ ల‌క్ష్య సాధ‌న‌లో సీఎం చంద్ర‌బాబు ఒక మైలురాయిని దాటారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది పేద కుటుంబాల‌ను పైకి తీసుకురావాల‌న్న సంక‌ల్పంలో కీల‌క అడుగు ప‌డింది.

అదే..ఏడాదిలో ఐదు ల‌క్ష‌ల కుటుంబాల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు సంప‌న్న వ‌ర్గాలు ముందుకు వ‌చ్చాయి. వాస్త‌వానికి పీ4 కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించి 8 నెల‌లు అయింది. ఈ 8 మాసాల్లో దాదాపు ఎక్క‌డికి వెళ్లినా.. సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. మార్గ‌ద‌ర్శుల కోసం ఆయ‌న నిరీక్షించారు. మొత్తానికి వారిని ఒప్పించి.. సుమారు 5 ల‌క్ష‌ల మంది బంగారు కుటుంబాల‌ను వారికి అప్ప‌గించేందుకు మార్గం సుగ‌మం చేసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన పేద‌రిక కుటుంబాల్లోని 5 ల‌క్ష‌ల మందిని ఆగ‌స్టు 15న మార్గ‌ద‌ర్శ‌కుల‌కు అందిస్తారు. అనంత‌రం.. ఆయా కుటుంబాల విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అంశాల‌ను మార్గ‌ద‌ర్శ‌కులు చూసుకుంటారు. వీరిని వ‌చ్చే మూడేళ్ల‌లో పైకి తీసుకురావాల‌న్న‌ది కీల‌క ల‌క్ష్యం. ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత‌.. మ‌రో 5ల‌క్ష‌ల కుటుంబాల‌ను మార్గ‌ద‌ర్శ‌కుల‌కు అందించే కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రాయంగా కొన‌సాగించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

దీనికి సంబంధించి ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు. క్షేత్ర‌స్థాయిలో బంగారు కుటుంబాల‌ను గుర్తించేందుకు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను వినియోగించుకోనున్నారు. అలానే మార్గ‌ద‌ర్శ‌కుల‌ను గుర్తించే బాధ్య‌త‌ను నేరుగా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. అంద‌రూ స‌మ‌న్వ‌యం ప‌నిచేయ‌డం ద్వారా.. 2029 ఎన్నిక‌ల‌కు ముందే.. 20 ల‌క్ష‌ల బంగారు కుటుంబాల‌కు.. మేలు చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు.