రాష్ట్రపతి రాజ్యాంగ బద్ధమైన పదవి. త్రివిధ దళాలకు కూడా అధిపతి. అయితే.. ఆ తర్వాత స్థానం ఉపరాష్ట్రపతిది. రాజ్యాంగంలో ని ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతిని నిర్వచిస్తుంది. అంటే.. ఇది కూడా రాష్ట్రపతి కంటే కొంచెం తక్కువే అయినా.. రాజ్యాంగబద్ధమైన పదవే. పైగా పెద్దల సభ రాజ్యసభకు చైర్మన్‌గా కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ ప్రకారం.. దేశంలో రెండో స్థానంలో ఉంటారు. అలాంటి పదవి దక్కించుకునేందుకు, ఆ పదవిలో కొనసాగేందుకు కూడా నాయకులు ఎంతో ఇష్టపడతారు. మళ్లీ మళ్లీ అన్నట్టుగా ఎదురు చూస్తారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగేవారు.. మరోసారి అవకాశం చిక్కితే బాగుండు! అనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఉదాహరణకు తెలుగువారైన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా చేశారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఆయనను పక్కన పెట్టారు. కానీ, ఆయన మాత్రం మరోసారి కూడా కావాలని కోరుకున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ.. ఎన్నికలు, రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మార్పు చేసిందన్న చర్చ కూడా సాగింది. ఇదిలావుంటే.. ఇంత కీలకమైన పదవిని జగదీప్ ధన్‌ఖడ్ తృణ ప్రాయంగా త్యజించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇలా అర్ధంతరంగా, మరీ ముఖ్యంగా పదవీకాలం మరో రెండేళ్లు ఉందనగా రాజీనామాలు చేసిన వారు ఒక్కరంటే ఒక్కరు లేరు. ఈ క్రమంలో జగదీప్ ధన్‌ఖడే ఈ విషయంలో రికార్డు సృష్టించారు.
అయితే.. ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం.. తన ఆరోగ్య సమస్యను ప్రస్తావించడం.. అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పడంపై అనేక అనుమానాలు, ప్రశ్నలు కూడా తెరమీదికివచ్చాయి. నిజానికి ఆయన అనారోగ్యమే నిజమైన కారణం అయితే.. ఉపరాష్ట్రపతిగా అందించే వైద్యం ముందు.. ఆయన వ్యక్తిగతంగా అందుకునే వైద్యం చిన్నదే. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి గా వ్యవహరించిన కృష్ణకాంత్(ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా చేశారు) పదవీ కాలంలోనే అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనను విదేశాలకు పంపించి మరీ వైద్య సేవలు అందించారు. నిరంతరం.. ఎఫ్ ఆర్ సీఎస్ వంటి ప్రముఖ వైద్యులను కూడా అప్పాయింట్ చేశారు. అయితే.. ఆయన అనారోగ్యంతోనే ఉపరాష్ట్రపతిగా ఉండి.. తనువు చాలించారు.
సో.. దీనిని బట్టి ఉపరాష్ట్రపతిగా ఉన్న వారికి ఎంత నాణ్యమైన వైద్యం అందుతుందో అర్ధమవుతుంది. పోనీ.. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారా? అంటే.. అది కూడా లేదు. ఎందుకంటే.. నెల రోజులు జరిగే సభల సమయంలో కనీసంలో కనీసం 10 రోజులు సెలవులే పోతాయి. మిగిలిన రోజుల్లోనూ కో చైర్మన్‌లు ఉంటారు. కాబట్టి.. ఒత్తిడి నుంచి తప్పించుకునే అవకాశంకూడా ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలు సరైనవి కాదన్నది నిపుణులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. ఈ ఏడాది బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ విజయం దక్కించుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఉచితాలపై అనేక ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లు కూడా ఇస్తామన్నారు.
ఇప్పుడు బీహార్ రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేయాలన్న వ్యూహమేదో అంతర్గతంగా సాగుతోందన్నది జాతీయ మీడియా చెబుతున్న మాట. రాష్ట్రపతి ఆదివాసీ బిడ్డ కాబట్టి.. ఆమెను రాజీనామా కోరకుండా.. ధన్‌ఖడ్‌తో చేయించారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. పైగా.. ఇప్పటికిప్పుడు తక్షణం అమల్లోకి వస్తుందని ఆయనే పేర్కొన్నారు. దీనిని బట్టి తెరవెనుక బీహార్‌కు చెందిన వారినిఎవరినో.. ఈ పదవిలోకి తీసుకురావడం ద్వారా.. ఎన్నికల ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates