విప‌క్ష‌ల డిమాండ్‌కు కేంద్రం ఓకే.. వ్యూహమేంటి?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తొలిసారి విప‌క్షాలు పెట్టిన డిమాండ్‌కు ఓకే చెప్పింది. 11 సంవ‌త్స‌రాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాలు పెట్టిన ఏడిమాండ్‌ను ఓకే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో తొలిసారి ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన డిమాండ్‌పై ఓకే చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి దీని వెనుక వ్యూహం ఏంటి? కేంద్రం ఎందుకు దిగి వ‌చ్చింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

అస‌లు విష‌యం ఏంటి?

సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 12కు పైగా కీల‌క బిల్లుల‌ను ఆమోదించుకునేందుకు మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ క్ర‌మంలో ఆదివారం మ‌ధ్యాహ్నం.. అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఇప్ప‌టికే కేంద్రం ఒక క్లారిటీతో ఉంది. ఈ క్ర‌మంలో స‌మావేశాల‌కు స‌హ‌కరించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు విన్న‌వించింది. అయితే.. కేంద్రంపై గ‌త నాలుగు మాసాలుగా గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స‌హా.. ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు.. త‌మ డిమాండ్ల‌ను తొలుత నెర‌వేర్చాల‌ని ప‌ట్టుబ‌ట్టాయి. వాటిపై హామీ ఇవ్వాల‌న్నాయి.

ముఖ్యంగా.. 1) ఆప‌రేష‌న్ సిందూర్ ను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేయాల్సి వ‌చ్చింది. 2) ప‌హ‌ల్గాం దాడికి ఒక రోజు ముందు ప్ర‌ధాని మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను అర్థంతరంగా ఎందుకు నిలుపుద‌ల చేసుకోవాల్సి వ‌చ్చింది. 3) ఆప‌రేష‌న్ సిందూర్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు.. అనంతరం జ‌రిగిన ప‌రిణామాలు. ఈ మూడు అంశాల‌పై పార్ల‌మెంటులో చ‌ర్చించాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. అయితే.. వాస్త‌వానికి వీటిని చ‌ర్చించేందుకు.. ఆది నుంచి కూడా కేంద్రం మొగ్గు చూప‌డం లేదు. అందుకే.. అనేక సంద‌ర్భాల్లో ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చినా.. ఆయా విష‌యాల‌ను మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

కానీ.. ఇప్పుడు కీల‌క‌మైన 12 బిల్లుల‌ను ఆమోదించుకోవాల్సి రావ‌డం.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న పార్టీల నుంచి కూడా ఇవే ప్ర‌శ్న‌లు వ‌స్తుండ‌డంతో పార్ల‌మెంటులో వీటిని చ‌ర్చించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే విప‌క్షాలు చేసిన డిమాండ్ల‌కు.. కేంద్రం మొగ్గు చూపింది. “ఓకే మీరు చేసిన డిమాండ్ల‌పై చ‌ర్చించేందుకు మేం సిద్ధం” అంటూ.. కేంద్రం ప్ర‌తిప‌క్షాల‌కు తేల్చి చెప్పింది.