జ‌గ‌న్ ఆశించేది ఒక‌టి.. జ‌రుగుతోంది మ‌రొక‌టి.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏం ఆశిస్తున్నారు? ఏం చేయాల‌ని భావిస్తున్నారు? అంటే.. ఖ‌చ్చితంగా కూట‌మి స‌ర్కారు పై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని.. అది త‌మ‌కు మేలు చేస్తుంద‌ని.. కాబ‌ట్టి.. నాలుగేళ్ల త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని పార్టీ నాయ‌కుల‌కు జ‌గ‌న్ తేల్చి చెబుతున్నారు. ఓకే.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు ఆమేర‌కు ఆశ‌లు ఉండ‌డం త‌ప్పుకాదు. అయితే.. మారుతున్న ప‌రిణామాలు.. పెరుగుతున్న కూట‌మి దూకుడుతో ఈ ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

1) నాలుగేళ్ల త‌ర్వాత‌.. మారే ప‌రిస్థితి: ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు.. కూట‌మి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును చూసి జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నికల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని అనుకుంటున్నారు. కానీ.. చంద్ర‌బాబు స‌హా ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎలా ఉన్నా.. వ‌చ్చే రెండేళ్ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల‌కు పెద్ద‌పీట వేస్తారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం కూడా వ‌స్తుంది. రైతుల‌కు నిధులు అందుతాయి. దీంతో పూర్తిగా అన్నీ మారిపోతాయి.

2) త‌మ పార్టీ పుంజుకుంటుంద‌నేది జ‌గ‌న్ భావ‌న‌: కానీ.. ఈ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూ బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మిగానే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయి. ఈ విష‌యాన్ని పార్టీల నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఈసారికి క‌ష్ట‌మైనా.. న‌ష్ట‌మైనా..క‌లిసి ఉండాల‌ని బ‌ల‌మైన నాయ‌కులే చెబుతున్నా రు. ఈ ప్ర‌భావంతో కూట‌మి క‌లిసి ఉంటుంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇది మ‌రోసారి వైసీపీకి పెను విప‌త్తుగా మార‌నుంది. అంటే.. ఆ పార్టీ పుంజుకునే అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది.

3) క‌లిసి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌: ప్ర‌జ‌ల ప‌రంగా చూసుకున్నా.. వైసీపీకి క‌లిసి వ‌చ్చే ప‌రిణామాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. స‌మాజంలోని 40 శాతం ఓటు బ్యాంకు ద‌గ్గ‌రే వైసీపీ ఆగిపోయింది. పైగా గ‌త ఏడాదికాలంలో ఇది పెరిగింద‌ని ఆపార్టీ నాయ‌కులు కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీనిని పెంచుకునేందుకు కూడా ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌డం లేదు. క‌లిసి వ‌చ్చే పార్టీలేదు. నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. సో.. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్గుగా అయితే.. ప‌రిణామాలు లేవ‌న్న‌ది .. విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.