త్రిమూర్తుల రాజ‌కీయం.. ఎక్క‌డైనా.. ఇంతేనా?!

ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారిన విష‌యం.. తోట త్రిమూర్తులు రాజ‌కీయం! సీనియ‌ర్ నాయ‌కుడిగా.. కాపు నేత‌గా.. ఫైర్ బ్రాండ్‌గా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. మ‌రీ ముఖ్యంగా రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న పేరుమోశారు. పార్టీల‌తో సంబంధం లేకుండా సొంత ఇమేజ్‌ను క‌న్‌స్ట్ర‌క్ట్ చేసుకున్న నాయ‌కుల్లో తోట త్రిమూర్తులు ఒక‌రు. ఇది ఆయ‌న‌కు మేలు చేసే ప‌రిణా మ‌మే అయినా.. త‌న దూకుడునే త‌న‌కు శ‌త్రువుగా పెంచుకున్నారనే విమ‌ర్శ‌లు కూడా ఆయ‌న‌పై ఉన్నా యి. గ‌తంలో టీడీపీలో ఉన్నా.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నా.. ఆయ‌నకు సొంత పార్టీ నేత‌లే శ‌త్రువులు కావ ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఇండిపెండెంట్‌గా గెలిచి.. త‌న స‌త్తా చాటిన త్రిమూర్తులు.. 2014లో టీడీపీ త‌ర‌ఫున రామ‌చంద్ర పురం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. దూకుడుకు ప‌ర్యాయ‌ప‌దంగా మార‌డంతో స్థానిక టీడీపీ నాయ‌కులు ఆయ‌న‌ను దూరం పెట్టారు. కీల‌క‌మైన య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, చిన‌రాజ‌ప్ప‌, బుచ్చయ్య చౌద‌రి.. ఇలా ఎవ‌రితోనూ ఆయ‌న‌కు స‌ఖ్య‌త లేక పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. కాపు ఉద్య‌మ నాయ‌కుల్లో అయినా.. ఆయ‌న సింప‌తీ సాధించారా? అంటే అది కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో పార్టీలో ఒంట‌రి అయ్యారు. ఇది గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ఫ‌లితం వ‌చ్చేలా చేసింది.

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీ గూటికి చేరిన తోట‌కు.. ఇక్క‌డ సొంత పార్టీలోనే సెగ మొద‌లైంది. ఆది నుంచి వైరివ‌ర్గంగా ఉన్న మాజీ మంత్రి సుభాష్ చంద్ర‌బోస్ పిల్లి.. ఇక్క‌డా తోట‌కు వ్య‌తిరేకంగా చ‌క్రంతిప్పుతూనే ఉన్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్ర‌పురం నుంచి పోటీ చేసి గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌.. అదే ప్ర‌త్య‌ర్థిగా.. ఇప్ప‌టికీ త్రిమూర్తులును ప‌రిగ‌ణిస్తున్నారు.

స‌రే! ఆదినుంచి వారు వైసీపీలో ఉన్నారు క‌నుక .. దూకుడు చూపిస్తున్నార‌ని అనుకున్నా.. వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ముందుకు సాగాల‌నే ఆలోచ‌న త్రిమూర్తులు కూడా చేయడం లేదు. త‌న‌కు జ‌గ‌న్ ద‌గ్గ‌ర రెపో ఉంద‌ని.. త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న భావిస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో నేత‌ల మ‌ధ్య క‌లివిడి లేక‌పోతే.. జ‌గ‌న్ మాత్రం రేపు ఏం చేస్తారు? ఈ విష‌యాన్ని త్రిమూర్తులు ఇప్ప‌టికైనా గ్ర‌హించి.. పార్టీ నేత‌ల‌తో క‌లిసిమెలిసి ఉండాల‌నేది ఆయ‌న సానుభూతిప‌రుల సూచ‌న‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.