త‌మ్ముళ్లు దారి త‌ప్పుత‌ప్పున్నారు.. బాబు స‌ర్‌!

ఒక పార్టీలో ఏ ఒక్క నేత దారి త‌ప్పినా.. అది పార్టీకి, ఆ పార్టీ అధినేత మెడ‌కు చుట్టుకుంటుంది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ వైసీపీనే. ర‌ప్పా.. ర‌ప్పా.. అంటూ.. కార్య‌కర్త‌లు హోర్డింగులు ఏర్పాటు చేశారు. కానీ, విమ‌ర్శ‌లు మాత్రం జ‌గ‌న్ కే వ‌చ్చాయి. అయితే.. దౌర్భాగ్యం ఏంటంటే.. వాటిని ఆయ‌న కూడా స‌మ‌ర్ధించుకున్నారు. ఇక‌, చేసేది ఏముంది..? జ‌గ‌న్ కూడా ర‌ప్పా ర‌ప్పా బ్యాచ్‌లో చేరిపోయారు. అంతో ఇంతో ఉన్న గౌర‌వం కూడా కోల్పోయారు.

ఇక‌, ఇప్పుడు ఈ తంతు టీడీపీకి కూడా పాకింది. ఇది కూడా.. పైన చెప్పుకొన్న‌ట్టుగా.. ఒక్క నాయ‌కుడు దారి త‌ప్పినా.. అది పార్టీ అధినేత మెడ‌కే చుట్టుకుంది. అలానే.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై.. ఆమెకు వ‌రుస‌కు బంధువ‌య్యే మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర ర‌గ‌డ‌కు దారితీశాయి. దీనిని టీడీపీ ఒక రాజ‌కీయ చాన్స్ గా తీసుకుంది. దీనిలో త‌ప్పులేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు ప్ర‌స‌న్న స‌హా.. జ‌గ‌న్‌పై నిప్పులుచెరిగారు.

కానీ.. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు టీడీపీకి చెందిన యువ‌నాయ‌కుడు.. ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చు కుంటున్న న‌గ‌రి ఎమ్మెల్యే(ఫ‌స్ట్ టైమ్ విజ‌యం ద‌క్కించుకున్నారు) గాలి భాను ప్ర‌కాశ్ మాజీ మంత్రి.. న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. “2 వేలు ఇస్తామంటే… రోజా బ‌జారు మ‌నిషిలా ఏమైనా చేస్తుంది” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లే గురువారం రోజు రోజంతా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో హైటెన్ష‌న్‌ను పెంచేశాయి. అయితే..ఇ ప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌పై రోజా హైకోర్టును ఆశ్ర‌యించారు.

మ‌హిళా క‌మిష‌న్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై సాక్షి మీడియాలో ఓ వ్యాఖ్య‌త చేసిన విమ‌ర్శ‌ల స‌మ‌యంలోను.. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి త‌న బంధువైన ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల స‌మ‌యంలోనూ.. టీడీపీ స్పందించిన‌ట్టుగా .. ఇప్పుడు ఎందుకు స్పందించ‌డం లేద‌ని వైసీపీ నాయ‌కులు కూడా నిల‌దీస్తున్నారు. మొత్తంగా ఇలాంటి ప‌రిణామాల‌ను.. ఇలాంటి నాయ‌కుల‌ను క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం టీడీపీ అధినేతగా చంద్ర‌బాబుకు ఉంది. లేక‌పోతే.. ఇలాంటి వారి వ‌ల్ల పార్టీ ప్ర‌తిష్ట‌. ప‌రువు కూడా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.