కేసీఆర్ జగన్‌తో క‌లిసిస్తే తప్పు లేదు కానీ

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయ‌కు డు కిష‌న్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ అప‌రిచితుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(ఇంకా రూపు దిద్దుకోలేదు) స‌హా ఇత‌ర న‌దీ జ‌లాల విష‌యం వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కిష‌న్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ అనుకూలంగా కేంద్రం తీర్పు ఇవ్వదని తెలిపారు.

ఏ రాష్ట్రాల జ‌లాల విష‌యంలో అయినా.. కేంద్రం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమేన‌ని కిషన్‌రెడ్డి చెప్పారు. తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య కేంద్రం చేప‌ట్టిన చర్చలను ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుబడుతోంద‌ని, కానీ, బీఆర్ఎస్‌ హయాంలో ఏపీ సీఎంగా ఉన్న జగన్‌తో క‌లిసి కేంద్రం మ‌ధ్య‌వ‌ర్తిగా చర్చలు జరపలేదా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. గోదావరి జలాలకు మళ్లిస్తామని చెప్పలేదా? అన్నారు. కేసీఆర్ అప్పుడు ఒక మాట‌.. ఇప్పుడు ఒక మాట చెబుతూ.. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

జ‌ల వివాదాల‌ పై రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలనేది కేంద్రం చెబుతున్న మాట‌గా కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులుపడాలనేదే కేంద్రం ఆలోచ‌న‌గా చెప్పారు. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్‌ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి సూచించారు. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారనడం సరికాదని మ‌రో వైపు కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా చుర‌క‌లు అంటించారు.

తెలంగాణ హక్కులను కాపాడటంలో.. బీజేపీ స‌హా కేంద్రం వెనకడుగు వేయదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఒక రాష్ట్రానికి అన్యాయం..మరో రాష్ట్రానికి మేలు చేయబోద‌ని.. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటామ‌ని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే కూర్చుని చ‌ర్చించుకోవ‌డంలో త‌ప్పులేద‌న్నారు. ప్ర‌స్తు తం బీఆర్ఎస్ నాయ‌కుల‌కు ప‌నిలేకుండాపోయింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అందుకే ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేస్తున్నార‌ని కిష‌న్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు.