వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించి… చట్టాన్ని పరిచయం చేసి.. మొట్టికాయలు వేసిన న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వాస్తవానికి బట్టును బదిలీ చేయించింది కూడా.. జగనే అనే ప్రచారం ఉంది. అప్పట్లో బట్టు బదిలీని వ్యతిరేకిస్తూ.. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీకి వస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి బట్టును నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టులో జస్టిస్ బట్టు రిలీవ్ కావడంతోనే ఏపీలో బాధ్యతలు తీసుకుంటారు. ఈ పరిణామం.. వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే.. చట్టం, న్యాయం ప్రకారం.. ముక్కుసూటిగా వ్యవహరించే న్యాయమూర్తుల్లో జస్టిస్ బట్టు ముందుంటారని న్యాయ వర్గాలు చెబుతాయి. ఆయన పనితీరు, ఇచ్చిన తీర్పులు కూడా అలానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న దూకుడు ప్రవర్తనకు, యాగీకి.. ఇక పై చెక్ పడనుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే… కేసులు ఆయన సమక్షానికి వెళ్తేనే చట్టం ప్రకారం ఏదైనా చేయగలరని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ బట్టు ఇచ్చిన తీర్పులు, వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకుంటున్నారు. పక్కా నిఖార్సుగా వ్యవహరించే న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.
గతంలో ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..
- సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చట్ట ప్రకారం.. ప్రభు త్వ నిధులను దుర్వినియోగం చేసేందుకు సహకరించిన అధికారులపై ఫైన్లు వేశారు.
- డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డు పై రెక్కలు విరిచి కట్టి పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. పోలీసులకు వారెంట్లు జారీ చేశారు.
- అమరావతి రాజధాని రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని ప్రైవేటుగా ఆయన సంభాషించారు.
- మూడు రాజధానుల బిల్లు అమలును తొలుత నిలిపివేశారు.
- ఎక్కడ ఏ వేదిక దొరికినా.. వైసీపీ సర్కారు లోపాలను పరోక్షంగా ఎత్తి చూపించేవారు.
- “మా అమ్మాయి ఢిల్లీలో చదువుతోంది. మీ రాజధాని ఏది? అని అక్కడివారు అడిగితే చెప్పుకోలేక పోయింది. ఇదీ.. దుస్థితి” అని ఢిల్లీలోని ఓ కార్యక్రమంలోనే ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates