తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతోందో ? అంటే అవుననే అంటోంది తమిళ మీడియా. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పెట్టాలని అళగిరి డిసైడ్ చేసుకున్నట్లు ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. కరుణానిధి ఉన్నపట్టి నుండే పెద్దకొడుకు అళగిరికి చిన్న కొడుకు స్టాలిన్ కు పడదన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తోడు కరుణానిధి తన రాజకీయ వారసునిగా స్టాలిన్ను ప్రకటించటంతో కుటుంబంలో పెద్ద గొడవే అయ్యింది. అయితే మాజీ ముఖ్యమంత్రి జోక్యం కారణంగా అన్నదమ్ముల మధ్య గొడవలు సద్దుమణిగింది.
అయితే కరుణానిధి మరణించిన తర్వాత సోదరుల మధ్య గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త పెద్దవయిపోయి చివరకు ఆళగిరిని పార్టీ నుండి బహిష్కరించాల్సొచ్చింది. అప్పటి నుండి పార్టీలో ఆధిపత్య గొడవలు తగ్గాయి. దానికి తగ్గట్లే అళగిరి కూడా రాజకీయంగా దాదాపు సైలెంట్ అయిపోయారు. 2014లో పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆయన రాజకీయ కార్యక్రమాలేవీ పెద్దగా లేవనే చెప్పాలి.
అలాంటిది ఇపుడు హఠాత్తుగా ఒక్కసారిగా అళగిరి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తొందరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు ఈనెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నైకు వస్తున్నారట. ఆ పర్యటనలో అమిత్-అళగిరి మధ్య భేటి జరగబోతోందంటు ప్రచారం ఒకటే ఊదరగొడుతోంది. దాంతో అళగిరి వెనకాల బీజేపీని ఉందంటు ప్రచారం పెరిగిపోయింది. ఎలాగైనా తమిళనాడు రాజకీయాల్లో ప్రభావం చూపాలని బీజేపీ సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించటం లేదు.
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటినీ తీసుకుంటే డిఎంకే పార్టీ తప్ప జనాలపై గట్టి ప్రభావం చూపగలిగిన పార్టీ కానీ గట్టి నేతకాని మరొకరు కనిపించటం లేదన్నది వాస్తవం. తమిళ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఒక దశలో మంచి ఊపుమీద కనిపించినా తర్వాత కనుమరుగైపోయింది. ఇక ఏఐఏడిఎంకెలో ముఖ్యమంత్రి ఓ. పళనిస్వామి, మాజీ సిఎం ఓ పన్నీర్ సెల్వం మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో ఏఐఏడిఎంకె గెలుస్తుందనే నమ్మకం కూడా ఎవరిలోను లేదు. ఇంకా చాలా పార్టీలున్నా అవన్నీ రాష్ట్రంలోని ఏదో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలు.
సో రాష్ట్రంలో గట్టి ప్రభావం చూపాలంటే ఇదే సరైన సమయమని బీజేపీ నేతల భావన. అందుకనే అళగిరిని వెనుకనుండి దువ్వుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి అళగిరి కొత్త పార్టీ పెడతారా ? లేకపోతే బీజేపీలో చేరుతారా ? అన్నది అమిత్ షా భేటిలో డిసైడ్ అయిపోతుందని సమాచారం. అయితే అమిత్ తో అళగిరి భేటి అవుతారన్న సమాచారం తనకు లేదని పార్టీ చీఫ్ ఎల్. మురుగన్ ప్రకటించారు. ఏ విషయము తేలాలంటే ముందు అమిత్ షా చెన్నైకు చేరుకోవాల్సిందే. అందుకనే అన్నీ పార్టీలు అమిత్ షా రాకకోసం ఎదురు చూస్తున్నాయి. చూద్దాం ఆరోజు ఏమవుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates