వరుసగా సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతూ వస్తున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కసారిగా 22 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా మరణాలు సంభవించలేదు. ఈరోజు ఏకంగా ముగ్గురు చనిపోయారు. వీరంతా హైదరాబాదుకు చెందినవారే. అయితే, ఆ ముగ్గురుకి ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. వారం తర్వాత కేసుల విజృంభణతో మళ్లీ ఇక్కడ కంగారు మొదలైంది. అయితే, చిన్న ఆశావహ పరిణామం ఏంటంటే…. ఈరోజు నమోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన కేసులే ఎక్కువ. ఈ ట్రెండు గత నాలుగైదు రోజులుగా కొనసాగుతోంది.
మూడ్రోజుల క్రితం కేవలం 2 కేసులు నమోదైనపుడు ఇక తెలంగాణలో కంట్రోలైపోయిందనుకున్న జనం తాజాగా 22 అయిపోయేసరికి… ఈ కరోనా దరిద్రం మనల్ని అంత సులువుగా వదిలే పరిస్థితి కనిపించడం లేదని అర్థమవుతోంది. తెలంగాణ మంచి చర్యలు తీసుకుంటోంది అని ఈరోజే కేంద్రం తెలంగాణ పనితీరును ప్రశంసించింది. ఆ గుడ్ న్యూస్ విన్న కొన్ని గంటల్లోనే ఇలా భారీగా కేసులు మరణాలు సర్కారును డిజప్పాయింట్ చేశాయి.
ఎందుకోగాని కేసులను బాగా కంట్రోల్ చేస్తున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక లాగా గవర్నమెంటు డీటెయిల్డ్ రిపోర్టులు ఇవ్వడం లేదు. కేవలం సింగిల్ పేజీలో చాలా తక్కువ సమాచారంతో సరిపెడతున్నారు. అదే ఆయా రాష్ట్రాలు టెస్టులతో సహా ప్రతిదీ డీటెయిల్డుగా ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ దానిని ఫాలో కావడం లేదు. మరోవైపు కేంద్రం నిబంధనలు సడలించుకుంటూ పోతుంటే… రాష్ట్రం మాత్రం వాటిని పట్టించుకోకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తోంది. చివరకు అత్యధిక కేసులున్న మహారాష్ట్ర కూడా కొన్ని చోట్ల నిబంధనలు సడలించింది. అయితే కేసీఆర్ మాత్రం అస్సలు రిస్కు తీసుకోవడం లేదు. అమెరికా నుంచి ఆంధ్ర వరకు అందరూ సిట్యుయేషన్ సీరియస్ గా ఉన్నా నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా మనసు మార్చుకుంటాడేమో అన్న చర్చ నడుస్తోంది.