ఆ ఏపీ మంత్రులిద్ద‌రు మ‌న‌స్సు దోచేశారుగా… !

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కొంతమంది మంచి మంత్రులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు మంత్రుల గురించి సీఎం చంద్రబాబు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారే అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి వరుస విజయం దక్కించుకున్న పయ్యావుల కేశవ్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న వివాదాస్పద రహితంగా వ్యవహరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడు.

సామాజిక వర్గాలు వేరైనా ఈ ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకోవడం.. నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్రస్థాయిలో కూడా వారి పేరు మార్మోగుతుండటం విశేషం. ‘మా మంచి మంత్రి’ అని పేరు తెచ్చుకునే లాగా వారు వ్యవహరిస్తున్నారు. నిమ్మల రామానాయుడు విషయాన్ని చూస్తే ఆయన గురించి అందరికీ దాదాపు తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మంత్రి పదవిలోకి వచ్చినా కూడా మెహర్బానీ, ఈగోతో వ్యవహరించకుండా పేదల పక్షపాతిగా రైతు బాంధవుడిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు వంటివి ఎప్పుడూ వార్త‌ల్లోకి వస్తూనే ఉంటాయి.

ముఖ్యంగా ఆయన సాధారణంగానే వ్యవహరిస్తారు. ఎక్కడ ఈగోలకు ఆధిపత్య రాజకీయాలకు ప్రయత్నం చేయరు. దీనికి తోడు మంత్రి అయిన తర్వాత మరింతగా తన‌నుతాను తగ్గించుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. విజయవాడలో వరదలు సంభవించినప్పుడు బుడమేరు వద్ద కట్ట వేయించే పనిని చేపట్టిన నిమ్మల రామానాయుడు పరిస్థితి అప్పట్లో ఆసక్తిగా మారింది. 104 డిగ్రీల‌ జ్వరంలో ఉండి కూడా ఆయన బుడమేరు కట్టను నిర్మించేలాగా తెల్లవారులు అక్కడే ఉండి పనులు చేయించారు.

ఇటీవల కూడా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒంట్లో బాగోకపోయిన చేతికి ఉన్న సిలైన్‌ స్టిక్కర్ తోనే సభకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఆయన రాజకీయాల్లో తన అంకిత‌ భావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక నియోజకవర్గ విషయానికి వస్తే చంద్రబాబు పిలుపునిచ్చిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లడం వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆడంబరాలకు పోకుండా ప్రజలు చెప్పేవన్నీ వింటూ విసుక్కోకుండా వారి నుంచి విన‌తులు స్వీకరిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక పయ్యావుల కేశవ్‌ విషయానికి చూస్తే ఈయన కూడా మా మంచి మంత్రిగా చంద్రబాబు దగ్గర మంచి మార్కులు సంపాదించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయిస్తూ చంద్రబాబు మనసును చూరగొన్నారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో పన్నుల ఎగవేత పై కీలక దృష్టి సారించారు. ఇక నియోజకవర్గ స్థాయిలో కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలను కలుస్తూ సుపరి పాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో నేలపై కూర్చుని సమస్యలు వింటూ ఒక రచ్చబండ టైపులో ప్రజలకు చెరువు కావడం పయ్యావుల కేశవ్ రాజకీయ పరిణితికి అడ్డం పడుతుందనే చెప్పాలి. ఇలా ఇద్దరు మంత్రులు కూడా మా మంచి మంత్రులుగా పేరు తెచ్చుకున్న వారు కావడం విశేషం.