తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఉద్యమంలో ప్రపంచంలో ఎక్కడా లేని సరికొత్త రీతులతో నిరసనలతో హోరెత్తించిన కేసీఆర్.. నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారు. ఆపై పదేళ్ల పాటు తెలంగాణను పాలించారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో తరచూ ఆసుపత్రికి వెళుతున్నారు. తాజాగా గురువారం రాత్రి యశోద ఆసుపత్రిలో జాయిన్ ఆయన శుక్రవారం ఆసుపత్రిలోనే ఏకంగా పార్టీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీనే అధికారికంగా ప్రకటించింది. ఈ సమీక్ష వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో తనను పరామర్శించేందుకు శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆయన నేతలతో ఆరా తీశారు. రైతులకు యూరియా లభ్యత, వ్యవసాయం, నీటి పారుదల, ప్రజా సమస్యలతో పాటుగా రాజకీయ పరిణామాలపైనా ఆయన నేతలతో చర్చించారు. ఆసుపత్రి అయినా అంతమంది నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన తీరుపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సరే.. ఎవరు ఏమనుకున్నా.. ఆసుపత్రిలో గురువారం రాత్రి నుంచి అందిన చికిత్సతో శుక్రవారం కేసీఆర్ ఉత్సాహంగా కనిపించారు. పార్టీ నేతలు చెబుతున్న విషయాలను వింటూనూ తాను కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ ఆయన ఒకింత హుషారుగా కనిపించారు. వైరల్ ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్… ఒక్కరోజులోనే కోలుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులు పాలుపంచుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates