ఇంటింటికీ బటన్ నొక్కే పని – జగన్ కొత్త అలోచన

ఏపీలో అధికార కూటమి, విపక్ష వైసీపీల మధ్య నిత్యం రాజకీయ మంటలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వ అసమర్థత పై ప్రశ్నిస్తానంటూ వరుస ప్రకటనలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. క్యూఆర్ కోడ్ తో ఇంటింటికీ వైసీపీ అంటూ చెప్పిన జగన్… ఈ క్యూఆర్ కోడ్ ను జనం స్కాన్ చేయంగానే వారికి కూటమి ప్రభుత్వం ఏ మేర నష్టం చేకూరుస్తోందన్న వివరాలన్నీ వస్తాయని చెప్పారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ కార్యక్రమానికి జనాల నుంచి స్పందన వస్తుందా?అన్న అనుమానాలు వైసీపీ నేతల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం.

ఇటీవలి జగన్ రెంటపాళ్ల టూర్ లో వైసీపీకే చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోవడం, వారిలో సింగయ్య ఏకంగా జగన్ కారు టైర్ కిందే నలిగి చనిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ తన టూర్లను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని, ఇందులో పోలీసుల ఆంక్షలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని కూటమి సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఇకపై తాను ఎక్కవ సార్లు జనంలోకి వెళ్లలేనని గ్రహించిన జగన్… పార్టీ నేతలను రంగంలోకి దించేందుకు వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఇంకో రెండేళ్ల తర్వాత చేపట్టాల్సిన క్యూఆర్ కోడ్ లాంటి కార్యక్రమాలకు ఇప్పుడే శ్రీకారం చుడుతున్నారని అంటున్నారు.

క్యూఆర్ కోడ్ ఇంటింటికీ కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రజల ఇళ్లకు వెళ్లి ఆయా లబ్ధిదారుల మొబైల్ ఫోన్లతో తమ వెంట తీసుకెళ్లే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయిస్తారట. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వస్తాయట. ఇంకో బటన్ నొక్కితే వాటిలో సదరు కుటుంబం ఏఏ పథకాలకు అర్హత ఉందో తెలుస్తుందట. దీంతో ఆయా పథకాలను కూటమి సర్కారు ఏడాదిగా అమలు చేయని కారణంగా సదరు కుటుంబానికి ఎంతమేర నష్టం వాటిల్లిందో తెలుస్తుందట. అంతేకాకుండా ఇంకో బటన్ నొక్కితే… ఈ ఏడాదిలో ఏ మేర తమకు వస్తుందో తెలుస్తుందట. ఆ తర్వాత దాని కాపీని దగ్గరపెట్టుకుని ఆయా కుటుంబాలు టీడీపీ నేతలను నిలదీస్తాయట.

విపక్షం అన్నాక ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తూనే ఉండాలి. లేదంటే జనం మదిలో నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. ఫలితంగా తన అంతర్ధానాన్ని తానే రాసుకున్నట్లు అవుతుంది. ఇదే వాదనతో ఈ కొత్త పథకానికి జగన్ రూపకల్పన చేసినా… వైసీపీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ జనం మధ్యకు ధైర్యంగా వెళ్లగలరా? అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనతో విసుగెత్తిన జనం కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెట్టి… వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఏడాదిగా ఇళ్లలోనే ఉండిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఇంటింటికీ వెళితే.. ఆయా కుటుంబాలు వీరికి స్వాగతం పలుకుతాయా? అన్నది అనుమానమే. అంతేకాకుండా ఈ సోది పురాణం వింటూ కూర్చుంటే మాకు కూడెట్టా? అని వైసీపీ నేతలపై మహిళలు చిరాకు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాలి.