పవన్ సై అంటే డీఎంకేకు దబిడిదిబిడే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసలే మొండి ఘటం. ఓ మాట అనుకున్నారంటే… దాని కోసం ఎంత దాకా అయినా ఆయన వెళతారు. అలాంటి పవన్ గురించి ఈ తమిళనాడు మంత్రికి పూర్తిగా తెలిసినట్లు లేదు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికై… సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్ లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న శేఖర్ బాబు సోమవారం పవన్ కల్యాణ్ ఆదివారం నాటి మధురై పర్యటనపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ఆయన పవన్ కు ఓ సవాల్ కూడా విసిరారు.

శేఖర్ బాబు సవాల్ విషయం పవన్ తెలిసి… సరదాగా శేఖర్ బాబు మాట ఎందుకు కాదనాలి? అని పవన్ సై అన్నారంటే ఇక డీఎంకే దబిడిదిబిడేనని చెప్పక తప్పదు. అయినా పవన్ కు శేఖర్ బాబు విసిరిన సవాల్ ఏమిటన్న విషయానికి వస్తే.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసి గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. అలా పవన్ గెలిచి నిలిస్తే… అప్పుడు పవన్ చెప్పిన మాటలన్నీ వింటామని కూడా శేఖర్ బాబు అన్నారు.

ఇప్పటిదాకా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తమిళనాడులో మూడు సార్లు పర్యటించారు. ఇందులో ఒకటి ఆధ్యాత్మిక పర్యటన కాగా… మిగిలిన రెండు పర్యటనల్లో తన మిత్రపక్షం బీజేపీ పిలుపు మేరకే ఆయన ఆయా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన శేఖర్.. బీజేపీ మాయలో పడి పవన్ తన పరువును పోగొట్టుకోవద్దని కూడా ఉచిత సలహా ఇచ్చారు. అసలు తమిళనాడుతో పవన్ కు ఏం సంబంధం అని కూడా ఆయన ప్రశ్నించారు. పవన్ సలహాలు తమకేమీ అవసరం లేదని కూడా ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఇటీవలే పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగితే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎంతమంది వచ్చారో చూశాం కదా. ఈ లెక్కన తమిళనాడులో పవన్ కు ఓ రేంజి ఫాలోయింగ్ ఉంది. ఇక శేఖర్ బాబు చెప్పినట్లు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలో తెలుగు ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గంలో నిలిస్తే… గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే… ఇప్పటికీ చెన్నై పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగు వారి ఓట్లే గెలుపును నిర్దేశిస్తున్నాయి. చూస్తుంటే.. శేఖర్ బాబు ఈ లెక్కలేవీ చూసుకోకుండా పవన్ కు సవాల్ విసిరినట్లున్నారు. మరి పవన్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం శేఖర్ బాబుతో పాటు యావత్తు డీఎంకేకు బ్యాండు బాజానేనని చెప్పక తప్పదు.