నిజమే… ఏపీలో ఇకపై విపక్షం వైసీపీ పప్పులు ఉడకవ్. ఆ పార్టీ ఇష్ఠారాజ్యంగా వ్యవహరించడానికి కూడా వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఒకే ఒక్క ఘటనతో వైసీపీ నేతలు, శ్రేణులకూ అర్థమైపోయింది. ఇకపై ఏ పని చేయాలన్నా పోలీసులు ఇచ్చిన అనుమతులు, విధించే ఆంక్షలకు లోబడే వైసీపీ నేతలు, శ్రేణులు ముందుకు సాగక తప్పదు. ఇందుకు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.
యువత పోరు పేరిట నిరుద్యోగులకు నిరుద్యుగ భృతి ఇవ్వాలని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ యువజన విభాగం నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో భాగంగా నరసరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పల్నాడు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోగా… పోలీసుల ఆంక్షలను, బారీకేడ్లను దాటుకుని వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించాయి. ఈ సందర్భంగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.
అయితే ఈ తరహా పరిణామాలను ముందే పసిగట్టిన పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. ఎప్పుడైతే వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారో… అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్న తేడా లేకుండా లాఠీలకు పని చెప్పారు. ఈ పరిణామాన్ని ఊహించని వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయినా కూడా విడిచిపెట్టని పోలీసులు వారిని తరుముతూ తమ ప్రతాపం చూపారు. తన ఆంక్షలను అతిక్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వైసీపీకి చూపించారు.
మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ అతి పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. జగన్ కారు కిందే పడి వైసీపీ కార్యకర్త నలిగిపోతే…ఆ విషయమే తనకు తెలియదని జగన్ ప్రకటించిన తీరు గమనార్హం. ఇక సత్తెనపల్లిలో మరో కార్యకర్త మరణించారు. ఇంత జరిగినా కూడా తమ ఆంక్షలను వైసీపీ నేతలు అతిక్రమించినా విపక్షం కదా అన్న భావనతో పోలీసులు సంయమనం పాటించారు. అయితే తమ సంయమనం తమకు శాపంగా మారుతుందని భావించిన పోలీసు శాఖ ఇకపై ఆ తరహా వైఖరికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే లాఠీచార్జీకి దిగింది. ఈ దెబ్బతో ఏపీలో వైసీపీ దూకుడుకు కళ్లెం పడినట్టేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates