మురుగన్ మానాడు పేరిట తమిళనాడులోని మధురైలో నిర్వహించిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుల సమ్మేళనంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తాను హిందువుగా పుట్టానని చెప్పిన పవన్… ఇతర మతాలను కూడా గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తానని కూడా పవన్ తెలిపారు. ఈ తరహా వైఖరి తన హక్కు అని చెప్పిన పవన్…ఇందులో ఇతరులు తన నమ్మకాన్ని అవమానించాల్సిన పని లేదన్నారు. ఎందుకంటే ఇతరులను నమ్మకాన్ని హిందువులు అవమానించడం లేదు కదా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు బయలుదేరే ముందు తమిళ సంప్రదాయ పంచెకట్టులోకి మారిన పవన్… మధురైలో మురుగన్ మాదిరి వస్త్రధారణలోకి మారిపోయారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తారని అనుకున్నా.. కారణం ఏమిటో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఫలితంగా పవన్ కల్యాణ్ ప్రసంగమే ఈ సమ్మేళనంలో కీలకంగా మారింది. అంతేకాకుండా మురుగన్ మానాడు ఉర్రూతలూగేలా పవన్ తనదైన శైలి ప్రసంగాన్ని చేశారు. సెక్యూలరిజాన్ని ప్రశ్నించిన పవన్…దేశంలో ప్రస్తుతం ఉన్నది అసలైన నకిలీ సెక్యూలరిజమని తేల్చి పారేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించడం గమనార్హం.
ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు…ఓ ముస్లిం తన మతాన్ని గౌరవించవచ్చు…అయితే ఒక హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం..అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనినే అసలైన నకిలీ సెక్యూలరిజం అంటారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మధురై పట్టణం గురించి..దాని చరిత్రను గురించి పవన్ పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న మధురై ఆలయాన్ని గతంలో 14వ శతాబ్దంలో మాలిక్ కపూర్ అనే రాజు దాడి వల్ల ఆలయం దాదాపుగా 60 ఏళ్ల పాటు మూతపడిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత చాలా కష్టాలు పడి ఆలయాన్ని తెరుచుకున్నామని ఆయన తెలిపారు.
దేశం, దేశ పౌరుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న పవన్… అందుకోసం ధైర్యం ఉండాలని తెలిపారు. 14 ఏళ్ల క్రితం జనసేనను ప్రారంభించిన సమయంలో తాను ఇలా ఇంతమంది హిందూ భక్తులు, సాధువుల మధ్య ప్రసంగిస్తానని కలలో కూడా అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తు మురుగనే తనను మధురైకి నడిపించారన్నారు. తనను పెంచింది, తనకు ధైర్యం నూరిపోసింది కూడా మురుగనేనని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తిమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని కూడా ఇంటరెస్టింగ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా మురుగన్ మానాడులో పవన్ కల్యాణ్ ప్రసంగం సుబ్రహ్మణ్యస్వామి భక్తులను విశేషంగా ఆకట్టుకుందనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates