ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఇటు కూటమి ప్రభుత్వం, అటు ప్రధాని మోడీ, మరోవైపు.. సొంత సోదరుడు జగన్‌ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి సర్కారు, ప్రధాని మోడీ సంగతి ఎలా ఉన్నా వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకు పడుతున్నారు. సమయం, సందర్భం చూసుకుని తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నారు. అయితే.. ఈ సందడిలో పడిన ఆమె.. పార్టీ కార్యక్రమాలపై ఒకింత సీతకన్నేశారు. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు పార్టీలో నిలవడం లేదు. ఉన్నా.. కార్యక్రమాలకు రావ డం లేదు. వచ్చినా.. షర్మిలకు జై కొట్టడమూ లేదు.
సీనియర్ మోస్టుల నుంచి సీనియర్లు, జూనియర్ల వరకు కూడా నాయకుల పరిస్థితి ఇలానే ఉంది. నిజానికి ఏ పార్టీకైనా.. నాయ కులు, కార్యకర్తలు ముఖ్యం. అయితే.. షర్మిల ఎందుకో.. సొంత జెండా.. అజెండాతో ముందుకు సాగుతున్నారన్నది పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిపోయారు. నేరుగా షర్మిలను విమర్శించకపోయినా. సొంత అజెండా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఆ తర్వాత.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. విజయవాడకు చెందిన మరికొందరు కూడా షర్మిలతో విభేదిస్తున్నారు.
అనంతపురం, కడపల్లో ఇటీవల నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో షర్మిలకు వ్యతిరేకంగా నాయకులు తీర్మానాలు చేశారు. వీరిలో కీలక నాయకురాలు, కమ్మసామాజిక వర్గానికి చెందిన సుంకర పద్మశ్రీ ఉన్నారు. ఇలా.. పార్టీలోని కీలక నాయకులు అందరూ.. కూడా షర్మిలకు వ్యతిరేకంగా జెండా ఎగరేస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా బీజేపీ తీర్థం పుచ్చుకుని షర్మిలకు సైలెంట్ షాకులు ఇచ్చారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్‌కు బై చెప్పారు.
అంతేకాదు.. షర్మిలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం గమనార్హం. ఆమె వల్ల పార్టీ మరింత దిగజారిందన్నారు. ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ వెంటనే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సమయంలో మురళీ కృష్ణ.. బీజేపీ కండువా కప్పుకున్నారు. మరి ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టో.. దిగజారుతున్నట్టో షర్మిల ఆలోచన చేసుకోవాల్సి ఉందని సీనియర్లు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates