గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఈ నెల 18న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటించారు. తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త 2024లో చనిపోయిన నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సమయంలో వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. అయితే.. విచ్చలవిడిగా వ్యవహరించిన కారణంగా.. ఆయన కాన్వాయ్ కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు నలిగిపోయినట్టు తాజాగాపోలీసులు ఓ వీడియోను వెలుగులోకి తీసుకువచ్చారు.
సింగమయ్య అనే వృద్ధుడు.. జగన్ కారు చక్రాల కింద పడి నలిగిపోయిన దృశ్యాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణయ్యను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈయనను ప్రభుత్వమే నియమించినట్టు తెలిసింది. మాజీ సీఎం జగన్‌కు ఉన్న ప్రొటోకాల్ ప్రకారం.. కారు డ్రైవర్లుగా ఇద్దరిని ప్రభుత్వం ఇస్తుంది. వీరిలో రమణయ్య ఒకరు. ఈయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
అయితే.. సింగమయ్య తన కారు కింద పడి చనిపోయిన విషయం తనకు తెలియదని రమణయ్య చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తాను ఫోన్‌లో చూసి అదే రోజు సాయంత్రం తెలుసుకున్నానని చెప్పాడు. ఈ ఘటనపై తాను జగన్‌తో మాట్లాడలేదని.. ఎస్పీ చేసిన ప్రకటనను మాత్రమే చూశానన్నారు. తమ కాన్వాయ్ కాదని ఎస్పీ నే చెప్పారని ఆయన చెప్పారు. అయితే.. తాజాగా వెలుగు చూసిన వీడియోలో సింగమయ్య తమ కారు కిందే పడిపోయి మరణించడంతో షాక్‌కు గురైనట్టు వెల్లడించారు.
వేలాదిగా తరలి వచ్చిన జనాలతో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని.. దీంతో కారు అద్దాలు తీసే అవకాశం కూడా లేకుండా పోయిందని రమణయ్య చెప్పుకొచ్చారని సమాచారం. ఏ చిన్న ప్రమాదానికి అవకాశం లేకుండా తాను చాలా నిదానంగా కారును నడిపినట్టు వెల్లడించారు. ఈ విషయం తనకు తెలియదని.. తనకు ఏ సంబంధం లేదని తెలిపాడు. అయితే.. పోలీసులు ఆయనను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates