గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో ఈ నెల 18న పర్యటించిన సమయంలో మాజీ సీఎం జగన్ తప్పు చేశారని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రం 10 గంటల సమయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాడు జగన్ పర్యటనలో మృతి చెందిన సింగమయ్య వ్యవహారాన్ని వివరించారు. తొలుత తాము జగన్ కాన్వాయ్ ఢీ కొనలేదని భావించామని.. ప్రైవేటు వాహనం ఒకటి ఢీ కొట్టినట్టు తమకు సమాచారం అందిందని దీంతో అదే నిజమని అనుకున్నమని చెప్పారు.
కానీ, తర్వాత పలువురు తీసిన వీడియోలను స్వాధీనం చేసుకుని పరిశీలించిన తర్వాత.. జగన్ ప్రయాణిస్తున్న వాహనమే.. సింగమయ్యను ఢీ కొట్టి.. కొంత దూరం పాటు ఈడ్చుకుపోయినట్టు తేలిందన్నారు. దీనిలో ఎలాంటి పొరపాట్లూలేవని చెప్పారు. విచారణ పరిధి పెరుగుతున్నప్పుడు.. అనేక విషయాలు వెలుగు చూస్తాయని.. దీనికి కొంత సమయం తీసుకోవడం తప్పుకాద ని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు తాను అప్పట్లో సింగమయ్య మృతికి, జగన్ కాన్వాయ్‌కి సంబంధం లేదని చెప్పిన మాట నిజమేనని.. కానీ, విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయని చెప్పారు.
తాము అసలు మాజీ సీఎం హోదాలో జగన్ పర్యటనకు 100 మంది అనుచరులు, కార్యకర్తలను, 14 వాహనాల కాన్వాయ్‌కి మాత్రమే అనుమతి ఇచ్చామని ఎస్పీ చెప్పారు. కానీ, తాడేపల్లి నుంచి జగన్ బయలు దేరిన సమయంలోనే ఏకంగా 50 వాహనాలతో వచ్చారని.. దారి పొడవునా హంగామా చేశారని తెలిపారు. ఇవన్నీ.. పోలీసు యాక్టు 30/2 మేరకు ఉల్లంఘనలేన ని చెప్పారు. దీనిపైనా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అయితే.. సింగమయ్య మృతిపై ఆయన సతీమణి లూర్ధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా మరో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కాన్వాయ్‌కు ఇచ్చిన అనుమతులు విస్మరించడంతోపాటు, పరామర్శ యాత్ర పేరుతో పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి జగన్ తప్పు చేశారని ఎస్పీ చెప్పారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం పీఎం నాగేశ్వరరెడ్డిలపై కేసులు నమోదు చేశామని, బీఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసులు పెట్టామని వివరించారు. చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates