బీజేపీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ 8 స్థానాల్లో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరిద్దరు అప్పటి కప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చి కమలం కండువా కప్పుకొన్నారు. అయితే.. ఏడాది పూర్తయిన నేపథ్యంలో వీరి పనితీరు ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? అనేది ఆసక్తికర విషయం. ఈ ఎనిమిది మందిలోనూ.. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. కూటమికి వ్యతిరేకంగా ఎవరూ పనిచేయడం లేదనేది ఒక్కటే ఆశాజనకం.
ఎచ్చెర్ల: ఈ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఈశ్వరరావు.. కూటమి నాయకులతో అవస రాన్ని బట్టి కలుస్తున్నారు. కానీ.. నియోజకవర్గంలో సమస్యల విషయంలో ఆయన స్పందన భిన్నంగా ఉంటోందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
విశాఖ ఉత్తరం: ఇక్కడ నుంచి మరోసారి విజయం దక్కించుకున్న సీనియర్ నాయకుడు.. విష్ణు కుమార్ రాజుకు మంత్రివర్గంపై ఆశ ఉంది. కానీ, ఆయన అది దక్కలేదు. దీంతో కొంత మనోవేదనతో ఉన్నారు. అయితే.. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు.. విశాఖ భూముల విషయంలో ఆయన చేస్తున్న పోరు. కూటమిలో ఇబ్బంది పెడుతోంది.
అనపర్తి: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చి కమలం కండువా కప్పుకొన్నారు. దీంతో ఆయనకు టీడీపీ వాసనలు ఇంకా పోలేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకులతో సఖ్యతగా ఉండడం తప్పుకాదు. కానీ, బీజేపీ నాయకులతో కలివిడి లేకపోవడం గమనార్హం. ఇక, ప్రజాసమస్యల విషయంపై మాత్రం ఇప్పుడే కాదన్న ధోరణితో ఉన్నారు.
విజయవాడ వెస్ట్: ఇక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయం దక్కించుకున్నారు. తొలి రెండు మాసాలు బాగానే వర్కవుట్ చేశారు. కానీ, తర్వాత.. మళ్లీ వ్యాపారాలు, వ్యవహారాల్లో మునిగిపోయా రు. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. దీంతో పశ్చిమలో పనులు చేసేవారు కనిపించడం లేదు.
జమ్మల మడుగు: ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆదినారాయణ రెడ్డి వ్యవహారం.. వివాదంగా మారింది. సొంత పార్టీనే ఆయన దిక్కరిస్తున్నారు. స్థానిక నాయకులతో ఆయనకు కలివిడి లేదు. పైగా ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదన్న టాక్ జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
ఆదోని: పీవీ పార్థసారథి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన ప్రజల సమస్యలు పట్టించుకోరు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటారు. అలాగని వ్యాపారాలు వ్యవహారాల్లో ఉంటారా? అంటే..అది కూడా లేదు. మరి ఏం చేస్తున్నారంటే.. నిధుల కోసం వేచి చూస్తున్నారని చెబుతున్నారు.
ధర్మవరం: మంత్రి సత్యకుమార్ యాదవ్.. తన శాఖ విషయంలో బలంగానే పనిచేస్తున్నారు. కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ఈయన అరికట్టలేక పోతున్నారనే వాదనా తెరమీదికి వచ్చింది.
కైకలూరు: మాజీ మంత్రిగా అనుభవం ఉన్న కామినేని శ్రీనివాసరావు.. నియోజకవర్గం కన్నా.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పార్టీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన అనుచరుడికి పగ్గాలు అప్పగించారు. ఇంతకు మించి.. ఈయన కూడా ఏమీ చేయలేక పోతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోనే కొల్లేరు ఉండడం అది వివాదం కావడం తెలిసిందే. అయినా.. కామినేని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates