తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అన్నదానిపై అప్పుడే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ నెలలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. 2018 – 2023 ఎన్నికల్లోను వరుసగా బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీచినా కూడా జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే నివేదిక పంపారు. ఆరు నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు జూబ్లీహిల్స్‌కు ఉపఎన్నిక జరుగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని ముందుగా బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత హఠాన్మరణంతో… ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటు కోల్పోయింది. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని ఎప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్గాలు.. నాయకులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం ద్వారా తమ సత్తా ఏంటో చాటి చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక్కడ నుంచి గోపీనాథ్ భార్య సునీతకు సీటు ఇస్తే సామాజిక వర్గ సమీకరణలతో పాటు.. సానుభూతి కలిసి వస్తుందని కేటీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులకే సీటు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే బిఆర్ఎస్ సీటును గతంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు.
దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కుటుంబానికి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న బస్తీలలోనూ.. మైనార్టీ వర్గాల్లోను మంచిపట్టు ఉంది. అలాగే గతంలో ఇక్కడ బిజెపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రావుల శ్రీధర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారు. గత లోక్సభ ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీరిలో కేటీఆర్ కరుణాకటాక్షాలు ఎవరిపై ఉంటాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates