బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ నూరుశాతం ఫెయిలయ్యాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్ పూర్తియిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ రిజల్ట్స్ ను విడుదల చేశారు. వాటి ప్రకారం మహాగట్ బంధన్ అధికారంలోకి రాబోతోందని చాలా స్పష్టంగా చెప్పాయి. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఎంజీబీ అధికారంలోకి రావటం ఖాయమంటూ బల్లగుద్ది మరీ చెప్పాయి.
ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే ఎన్డీయే లేకపోతే బీజేపీకి మద్దతుగా ఉండే రిపబ్లిక్ టీవీ జరిపించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా ఎంజీబీదే అధికారమని తేలటంతో అందరు నమ్మేశారు. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటి వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనాలు వేసినట్లే కనబడింది. అయితే కౌంటింగ్ మొదలైన రెండు గంటల తర్వాత నుండి పరిస్ధితుల్లో మార్పులు మొదలయ్యాయి. ఎంజీబీకి ఉన్న ఆధిక్యతలన్నీ తగ్గిపోయి ఎన్డీయే వైపు పెరిగాయి. అలా పెరిగి పెరిగి చివరకు ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని పెంచేశాయి.
సో జరిగింది చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు నూటికి నూరు శాతం తప్పుపోవటం బహుశా ఇదే మొదటిసారేమో. కౌంటింగ్ తర్వాత వస్తున్న విశ్లేషణల ప్రకారం ఎన్డీయేలోని ప్రధాన భాగస్వాముల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పూర్తిగా దెబ్బ తినేసినట్లు అర్ధమైపోతోంది. ఇదే సమయంలో జేడీయుని మించి బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. అంటే ఎన్డీయే కూటమిలో బీజేపీ లేకపోతే ఈ కూటమికి ఘోర పరాజయం ఎదురయ్యేదనటంలో సందేహం లేదు.
ఇదే సమయంలో ఎంజీబీ కూటమిలో కాంగ్రెస్ పార్టీనే కూటమి విజయావకాశాలను దెబ్బ కొట్టిందని అర్ధమైపోతోంది. ఎలాగంటే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్ధులు పోటి చేసిన 70 సీట్లలో మెజారిటిలో ఉన్నది 20 మంది అభ్యర్ధులు మాత్రమే. మిగిలిన 50 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్ధులే లీడ్స్ లో ఉన్నారు. అదే ఆర్జేడీ పోటి చేసిన నియోజకవర్గాల్లో మెజారిటి సీట్లలో ఆర్జేడీ అభ్యర్ధులే గెలుపుదిశగా వెళుతున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఎంజేబీ కూటమిలో పార్టీగా పోటి చేసిన సిపిఐ(ఎంఎల్) అభ్యర్ధులు కూడా మెజారిటి స్ధానాల్లో దూసుకుపోవటమే. చాలా కాలం తర్వాత లెఫ్ట్ పార్టీ మంచి ఫలితాలను చూసిందనే చెప్పాలి.