రెండో రోజూ ఏఐజీకి కేసీఆర్… ఏం జరుగుతోంది?

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం వరుసగా రెండో సారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం వైద్య పరీక్షలు పూర్తి కాలేదో, లేదంటే ఆ పరీక్షల్లో ఏదైనా సీరియస్ ఆరోగ్య సమస్య గుర్తించారో తెలియదు గానీ శనివారం కూడా కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు.

కేసీఆర్ శనివారం నాడు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లే సందర్భంగా ఆయన వెంట కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు ఆసుపత్రికి తరలివెళ్లారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. కేసీఆర్ జనరల్ చెకప్ కోసమే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని, వైద్య పరీక్షల తర్వాత ఆయన తిరిగి ఇంటికి వెళతారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే… శుక్రవారం ఐఏజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ కు ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిగాయి. తాజాగా శనివారం కూడా కేసీఆర్ కు జరుగుతున్న వైద్య పరీక్షలు, ఇతరత్రా చికిత్సలను కూడా నాగేశ్వరరెడ్డి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వయసురీత్యా నెలకొన్న అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా కేసీఆర్ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మరి శనివారం నాటి వైద్య పరీక్షల్లో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఏమైనా వివరాలు వెల్లడవుతాయో, లేదో చూడాలి.