రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. ఈ పాలనపై ప్రజలు ఎలా ఫీలవుతున్నారన్నది ఒక కాన్సెప్టు అయితే.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందన్నది మరో ప్రధాన కాన్సెప్టు. దీనిలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పని తీరు కీలక కాన్సెప్టు. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పనితీరు ఎలా ఉందన్నది అన్ని వర్గాలు చర్చిస్తున్న విషయం. ఎందుకంటే.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. అంతే తొలిసారిగా పాలనలోకి అడుగు పెట్టారు. అందునా..సీఎం చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడి టీంలో ఆయన కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఏడాది కాలంలో పవన్ వేసిన అడుగులు ఎలా ఉన్నాయి? ఆయన ఎలా వ్యవహరించారన్నది ఆసక్తికరం. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. ఆది నుంచి కూడా పవన్ భిన్నమైన విధంగా స్పందిస్తూ వచ్చారు. సాధారణంగా అధికారంలో ఉన్నవారికి ఉండే గీర్వాణం.. అధికార లాలస వంటివి ఆయనలో కనిపించలేదు. పైగా సాధారణ పరిపాలనకు భిన్నంగా తనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధిలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏకకాలంలో గ్రామ సభలు పెట్టారు. తద్వారా సమస్యలపై చర్చించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేశారు.
అలానే అడవితల్లి బాట పేరుతో గిరిజనులకు చేరువయ్యారు. ఎక్కడో మారుమూల ఉండే మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మా ణానికి ప్రాధాన్యం ఇచ్చారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అలానే.. కార్మికులు అన్న పదాన్ని కొత్తగా మార్చుతూ.. ‘శ్రామికులు’గా వారిని గౌరవించారు. ఆపదలో ఉన్నవారు ఎవరు వచ్చినా.. సొంత నిధుల నుంచి సాయం చేశారు. చేస్తున్నారు. అలానే గ్రామీణ భారతం బాగుండాలంటే.. సర్పంచులకు, గ్రామ సభకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని భావించి సర్పంచులకు తిరిగి చెక్ పవర్ కల్పించారు. వారి నిధులను వారికే కేటాయించారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. మరోవైపు.. సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని దానికి ఒక ఐకాన్‌గా పవన్ కల్యాణ్ నిలిచారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందన్నప్పుడు.. ఆయన దీక్ష చేశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు పట్టుబట్టి.. ఆయన టీటీడీతో క్షమాపణలు చెప్పించారు. అలాగే.. బీజేపీతోనూ ఆయన అనుబంధం కొనసాగిస్తున్నారు. కేంద్ర పెద్దలతో ఆయనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని ఎక్కడా చెదిరి పోకుండా చూసుకుంటున్నారు. తరచుగా సీఎం చంద్రబాబు విజన్‌ను, ఆయన పాలనను కూడా కొనియాడారు. తద్వారా కూటమి బలంగా ఉందన్న భావాన్ని తీసుకువచ్చారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఆయన స్పందించారు. ఇలా.. డిప్యూటీ సీఎం ఈ ఏడాది కాలంలో తనదైన శైలిలో ప్రత్యేక పాలన దిశగా అడుగులు వేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates