కూట‌మి ప‌థ‌కానికి జ‌గ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్‌

గ‌త ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింది కూట‌మి ప్ర‌భుత్వం. ఐతే ఏ ప్ర‌భుత్వ‌మైనా అన్ని హామీల‌నూ నిల‌బెట్టుకోవ‌డం సాధ్యం కాదు. ఐతే కొన్ని ప్ర‌ధాన‌మైన హామీల‌ను అయినా నెర‌వేరిస్తే జ‌నాల మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ప్ర‌తిప‌క్షాలకు విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం త‌గ్గుతుంది. ఐతే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా అన్ని విష‌యాలూ స‌మీక్షించుకుని కూట‌మి ప్ర‌భుత్వం ఒక్కో హామీని నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందులో భాగంగానే అత్యంత కీల‌క‌మైన హామీల్లో ఒక‌టైన త‌ల్లికి వంద‌నంను మొద‌లుపెట్ట‌డానికి ప్ర‌భుత్వం స‌న్నాహాలు పూర్తి చేసింది. గ‌త ఏడాది అప్పుడే అధికారంలోకి రావ‌డం వ‌ల్ల ఈ హామీని ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేక‌పోయింది.

ఐతే ఈ విద్యా సంవ‌త్స‌రం మొద‌లు కాబోతుండ‌గా.. త‌ల్లికి వంద‌నం అమ‌లుకు ఏర్పాట్లు చేసింది. గురువార‌మే పిల్ల‌ల త‌ల్లుల అకౌంట్ల‌లో డ‌బ్బులు ప‌డ‌బోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 ల‌క్ష‌ల మంది ఈ ప‌థ‌కం కింద ప్ర‌యోజ‌నం పొంద‌బోతున్నారు. విశేషం ఏంటంటే.. వైసీపీ ప్ర‌భుత్వంలో మాదిరి పిల్ల‌లు ఎంద‌రున్నా ఒక్క‌రికే ప‌థ‌కం వ‌ర్తించ‌బోదు. ఎంద‌రు పిల్లలుంటే అంద‌రికీ త‌లో రూ.15 వేలు అందించ‌బోతోంది కూట‌మి ప్ర‌భుత్వం. ఈ ప‌థ‌కం అమ‌లు ఈ స‌ర్కారు వైసీపీకి ఇవ్వ‌బోయే మాస్ట‌ర్ స్ట్రోక్‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వైసీపీ మ‌ద్ద‌తుదారులు త‌ల్లికి వంద‌నం హామీ నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

స్వ‌యంగా జ‌గ‌నే ఓ సంద‌ర్భంలో నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఎద్దేవా చేసిన వీడియో వైర‌ల్ అయింది. దీన్నే ఇన్ని రోజులు వైసీపీ వాళ్లు ఒక ఆయుధంలా వాడారు. ఐతే ఇప్పుడు ఆ వీడియోనే కూట‌మి ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుదారులు ఉప‌యోగిస్తున్నారు. ఆల్రెడీ టీడీపీ సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ వీడియో పెట్టి పథ‌కం అమ‌లు గురించి పోస్టులు పెడుతున్నారు. ఈ ప‌థ‌కానికి జ‌గ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్ అని.. దీన్ని విస్తృతంగా వాడ‌డం ద్వారా ఆయ‌న వేలితో ఆయ‌న కంటినే పొడవ‌బోతున్నార‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లుతో వైసీపీ వాళ్ల నోళ్ల‌కు తాళాలు ప‌డినట్లే కనిపిస్తోంది.