-->

స‌జ్జ‌ల మూర్ఖుడు: ష‌ర్మిల‌

వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేట‌ర్‌.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఆయ‌న మూర్ఖుడు.. అంటూ దుమ్మెత్తి పోశారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆ త‌రహా మ‌హిళ‌లు ఉంటారంటూ.. సాక్షిమీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై మ‌హిళ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజ‌ధాని మ‌హిళ‌లు మ‌రింత ఎక్కువ‌గా ఆవేద‌న‌, ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు సాక్షి ఆఫీసుల వ‌ద్ద నిర‌స‌న‌లు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌, కొమ్మినేని, వ్యాఖ్య‌లు చేసిన‌ కృష్ణం రాజు దిష్టి బొమ్మ‌ల‌ను త‌గుల పెట్టారు. వారి ఫొటోలను చెప్పుల‌తో కొట్టారు. సాక్షి ఆఫీసుల వ‌ద్ద‌.. పేర్ల‌ను తొల‌గించారు. ఇలా వివిధ రూపాల్లో త‌మ ఆవేద‌న ను వ్య‌క్తం చేశారు. అయితే.. ఇలా మ‌హిళ‌లు నిర‌స‌న చేయ‌డాన్ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌ప్పుబ‌ట్టారు. మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న రాక్ష‌సులు, పిశాచాలు కూడా ఇలా చేయ‌బోవ‌ని వ్యాఖ్యానించారు. సంక‌ర జాతికి చెందిన వారే ఇలా చేస్తార‌ని అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లారాయ‌చోటిలో ప‌ర్యటించిన ష‌ర్మిల‌. స‌జ్జ‌ల వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. “ఒక మూర్ఖుడిలా మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోంది.” అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. క‌నీసం మ‌హిళ‌ల విష‌యంలో ఆలోచ‌న కూడా లేకుండా వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

“సజ్జల కుమారుడు భార్గవ్‌రెడ్డి సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకొని నాపై కూడా దుష్ప్రచారం చేశారు. వైఎస్‌ కుమార్తె, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్‌ అందరినీ నా అక్కాచెల్లెళ్లు అంటారు.. కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు?” అని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. స‌జ్జ‌ల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు.