దేశంలో కొత్త యుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. “చేయాలన్న ద్రుఢ సంకల్పం.. పట్టుదల ఉంటే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండబోద“ని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే నిదర్శనమని తెలిపారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో నిర్మించిన రెండు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. వీటిని ప్రస్తావించిన చంద్రబాబు.. ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.
జమ్ము కశ్మీర్‌లో దాయాది దేశం పాకిస్తాన్ నుంచి మనకు అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. దీంతో అక్కడ పక్కా భద్రత, అనుక్షణం అప్రమత్తతతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇలాంటి చోట.. రెండు కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడమే కాకుండా.. వాటిని తాజాగా ప్రారంభించింది. వీటిలో 1) చీనాబ్ బ్రిడ్జి. 2) అంజీ రైల్వే వంతెన. ఈ రెండు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
చీనాబ్ బ్రిడ్జి: ఇది ప్రపంచంలోనే ఎత్తయిన రైలు ఆర్చ్ వంతెన.
అంజీ రైల్వే వంతెన: ఇది దేశంలోనే మొట్టమొదటి తీగలతో అనుసంధానించిన నిర్మాణం.
వందేభారత్ రైళ్లను వీటి ద్వారా నడుపుతారు. ముఖ్యంగా వైష్ణోదేవి కొలువైన కట్‌ఢా నుంచి శ్రీనగర్ వరకు రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఇంత సాహసోపేత మైన నిర్మాణాలు చేయడం.. ప్రారంభించడం.. ప్రధాని మోడీకే సాధ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే తరహాలోనే ఏపీ రాజధాని అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని.. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోనూ సువర్ణ యుగం ప్రారంభం అవుతుందని చంద్రబాబు అభిలషించారు. అమరావతి కూడా దేశానికే తలమానికమైన ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.