బంజారాహిల్స్ లో ‘జాగృతి’!…వివాదాల జోలికెళ్లని కవిత!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి సంస్థ బంజారాహిల్స్ లోని నూతన కార్యాలయంలోకి మారింది. నిన్నటిదాకా ఇందిరా పార్క్ సమీపంలోని అశోక్ నగర్ కేంద్రంగా సాగిన ఈ కార్యాలయాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనకు మరింత అందుబాటులో ఉండే విధంగా బంజారాహిల్స్ లోని తన ఇంటికి సమీపంలోని ప్రైవేటు భవంతిలోకి మార్చేశారు. శనివారం సంప్రదాయబద్ధంగా పూజలు చేసి కవిత పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

నూతన కార్యాలయం ప్రారంభించిన తర్వాత అదే కార్యాలయంలో కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి ప్రస్థానాన్ని వివరించిన కవిత… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే… జాగృతి మరో కన్ను అని పేర్కొన్నారు. కేసీఆర్ తో పాటు ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలోనే జాగృతి సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆమే పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కూడా కీలక భూమిక పోషించిందని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ లో జాగృతి ఓ అంతర్భాగం అయినప్పటికీ బీఆర్ఎస్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో పోరాటం సాగించిందని ఆమె తెలిపారు.

అనంతరం కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించిన కవిత… తెలంగాణను సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపితగా నిలిచారని తెలిపారు. అలాంటి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమంటే… యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టేనని ఆమె ధ్వజమెత్తారు. కోటి ఎకరాలకు నీరందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? అంటూ ఆమె కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఓ వైపు ఏపీ ప్రభుత్వం పోలవరం, బానకచర్ల ప్రాజెక్టు పేరిట గోదావరికి చెందిన 200 టీఎంసీలను తరలించుకుపోతుంటే,.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆమె మండిపడ్డారు. తక్షణమే అపెక్స్ కమిటీకి ఏపీ తీరుపై ఫిర్యాదు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే..చిట్ చాట్ ల పేరిట తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆయన పేరెత్తకుండానే విమర్శించిన కవిత… జాగృతి సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాత్రం ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడం గమనార్హం. ఈ సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కవిత… తన పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం. వాస్తవానికి చిట్ చాట్ లోనే కేటీఆర్ పై విరుచుకుపడ్డ కవిత… నేరుగా మీడియా సమావేశం అంటే మరింతగా రెచ్చిపోతారని మీడియా ప్రతినిధులు బావించినా.. ఆ దిశగా కవిత సింగిల్ వ్యాఖ్య కూడా చేయలేదు.