ఏపీలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మ్యూల్యాంకనంలో తప్పులు దొర్లడం.. పలువురు విద్యార్థులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. వేలాది మంది పదోతరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని.. ప్రకటించి, రికార్డుల కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టారని” ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో స్పందించారు.
వైసీపీ అదినేత జగన్‌పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. “చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఇంతకన్నా ఎక్కువే జరిగిందని.. అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అంతేకాదు.. విద్యార్థుల యూనిఫాం నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు వేసుకుని, సొంత పేర్లు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాత్రం విద్యార్థులు, విలువల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
“జగన్ ప్రజా జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయ్యారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలను రద్దుచేసిన మీరూ మాట్లాడుతున్నారా?. అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. మీరు తీసుకొచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. టీచర్లను, విద్యార్థులను సన్నద్ధం చేయకుండానే సీబీఎస్ఈ తీసుకొచ్చారు. నేను మంత్రి కాగానే వారికి పరీక్ష నిర్వహించగా 30 శాతం మంది ఫెయిల్ అయ్యారు.” అని లోకేష్ తెలిపారు.
ఐబీ తీసుకొచ్చినట్టు కలలు కంటున్నారని, వాస్తవానికి వైసీపీ తీసుకొచ్చింది ఐటీ సిలబస్ కాదు.. ఐబీ అమలుకు రిపోర్ట్ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారని లోకేష్ పేర్కొన్నారు. ఇక టోఫెల్ బోధించే టీచర్లు లేకపోయినా టోఫెల్ తెచ్చినట్లు జబ్బలు చరుచుకుంటున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.4,500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిపోయారని విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో టీచర్ల బదిలీలకు ఓమంత్రి డబ్బులు వసూలు చేశారన్నది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు. వైసీపీ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు.