మహానాడు వేదికగా చంద్రబాబు గర్జన విన్నాక.. ప్రత్యక్షంగా చూశాక.. ఆయన ఉద్దేశం స్పష్టంగా తెలిసిపోయింది. కడప జిల్లా ఎవరి సొత్తూ కాదని తేల్చేశారు. ఇక నుంచి కడప కేంద్రంగానే చంద్రబాబు రాజకీయాలు సాగించనున్నారన్న సందేశం స్పష్టంగా కనిపించింది. గండికోట ప్రాజెక్టు నుంచి కడప ఉక్కు కర్మాగారం వరకు చంద్రబాబు తన వ్యూహాలను వివరించారు. అంతేకాదు, బలమైన ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడానికీ కృషి చేశారు.
ఇది సాధారణంగా జగన్ ప్రభావం బలంగా ఉన్న కడపలాంటి జిల్లాలో సాధ్యం కాదన్న భావనను చంద్రబాబు దాదాపు తుడిచిపెట్టేశారు. కానీ, రెండు సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే.. అదే సమయంలో జగన్ కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో బలంగా అడుగుపెట్టారు. అప్పట్లో సీఎం అయిన జగన్ అక్కడ రెండు కీలక సభలు నిర్వహించారు. కుప్పంలో జెండా ఎగరేస్తామని ప్రకటించారు. చంద్రబాబును ఓడించి తీరుతామన్నారు. కానీ, చివరికి వైసీపీ జెండా ఎగరలేదు.
ఇప్పుడు చంద్రబాబు నోటి నుంచి అటువంటి తీవ్ర వ్యాఖ్యలు రాకపోయినా.. కడపలోని 10 స్థానాలను తాము కైవసం చేసుకుంటామని చెప్పడం ద్వారా.. ఆయన సంకల్పం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో, అప్పట్లో కుప్పంను కాపాడుకోవడంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాలను.. ఇప్పుడు జగన్ అనుసరిస్తారా? లేక ఏం జరిగినా తనకు సంబంధం లేదని భావిస్తారా? అనేది చూడాలి. ముఖ్యంగా, ప్రజలు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని పరిస్థితుల్లో జగన్ ప్రణాళిక ఎంతో కీలకంగా మారనుంది.
మార్పుకు సిద్ధంగా ఉన్న ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో జగన్ సచేతంగా వ్యవహరించకపోతే.. అది వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకురావచ్చు. ప్రస్తుతం చంద్రబాబు ఆ మార్పు దిశగానే కడప ప్రజలను తనదైన శైలిలో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసుకుని జగన్ తగిన విధంగా స్పందించకపోతే, రాబోయే రోజుల్లో పార్టీకి సవాళ్లు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
అయితే, రాజకీయాల్లో ఈరోజు పరిస్థితి నాలుగు సంవత్సరాలు కొనసాగుతుందా? అన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఇక జగన్ వంతు వచ్చింది. మరి ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.