బీహార్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి మంత్రం పనిచేయలేదా ? మూడోదశ పోలింగ్ జరిగిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను గమనిస్తే ఇదే విషయం అర్ధమైపోతుంది. బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మోడి వరుసగా రెండోసారి కూడా ఫెయిల్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే 2015 ఎన్నికల సందర్భంగా బీహార్ జనాలపై మోడి ఎన్ని వరాలు కురిపించినా ఎవరు నమ్మలేదు. ఇపుడు కూడా చాలా వరాలే ప్రకటించినా ఉపయోగం లేదని తేలిపోయింది. స్వయంగా మోడి మంత్రమే పనిచేయలేదంటే మిగిలిన వాళ్ళ ప్రభావం ఏమాత్రం లేదని తేలిపోయింది.
బీహార్ ఎన్నికల్లో జాతీయస్ధాయి అంశాలకన్నా స్ధానిక అంశాలే ప్రధానపాత్ర పోషించినట్లు అర్ధమవుతోంది. 15 ఏళ్ళుగా సిఎంగా ఉంటున్న జేడీయు అధ్యక్షుడు నితీష్ కుమార్ పాలనపై జనాల్లో పెద్దగా కంప్లైంట్లు లేవనే చెప్పాలి. కాకపోతే కరోనా వైరస్ నేపధ్యంలో వలసకూలీల సమస్యలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవటం, వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను సక్రమంగా ఆదుకోలేకపోవటం లాంటి అంశాలే నితీష్ సర్కార్ పై బాగా వ్యతిరేకత పెంచినట్లు అర్ధమవుతోంది.
ఇదే సందర్భంలో మోడిపైన కూడా జనాల్లో వ్యతిరేకత ఉన్న విషయం స్పష్టమైంది. దీని కారణంగానే నితీష్+మోడిపై ఉన్న వ్యతిరేకత వల్లే జనాలు ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. అసలు మొదటి నుండి నితీష్, బీజేపీ నేతలు మహా గట్ బంధన్ కూటమిని పెద్దగా లెక్క చేయలేదు. ఇదే సమయంలో తేజస్వి అంటే చాలా చిన్నచూపు చూసినట్లే కనిపించింది. విచిత్రమేమిటంటే గడచిన 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కానీ ఆరు సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న మోడి ఎప్పుడో పాలించిన తేజస్వి తండ్రి, ఆర్జేడీ మాజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలోని అవినీతి గురించి పదే పదే ప్రస్తావించటం.
బీహార్ అంటేనే కుల, మతాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇటువంటి రాష్ట్రంలో ముస్లింలు, యాదవుల్లో మెజారిటి ఆర్జేడీ వైపే నిలబడ్డారని ఎగ్జిట్ పోల్సులో అర్ధమైపోయింది. వీళ్ళకు అదనంగా 30 ఏళ్ళలోపు యువత కూడా తేజస్వీ వైపే మొగ్గు చూపారని సర్వేలో తేలింది. మొదటి విడత పోలింగ్ పూర్తియిన తర్వాత కానీ తేజస్వీ ప్రభావం ఏమిటో ఎన్డీయే నేతలకు అర్ధం కాలేదు. అయితే అప్పటికే వాళ్ళ చేయిదాటిపోయింది. అందుకనే రెండో విడత, మూడో విడత పోలింగ్ లో కూడా స్పష్టంగా ఆర్జేడీ డామినేషన్ తెలిసిపోయింది. దాని ఫలితమే ఎగ్జిట్ పోల్ సర్వేలు. చూద్దాం 10వ తేదీ అసలు ఫలితాలు వచ్చేస్తాయి కదా.