మూడు ద‌శాబ్దాల క‌ల‌.. వైసీపీ నోటికి తాళం వేసిన భువ‌న‌మ్మ‌.. !

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో అధునాత‌న సౌక‌ర్యాలతో ఇంటిని నిర్మించుకున్నారు. సుమారు 2 ఎక‌రాల విస్తీర్ణంలో అత్యాధునిక వ‌స‌తుల‌తో దీనిని నిర్మించారు. సుమారు 25 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది. మొత్తంగా 7 బెడ్ రూమ్‌లు, సువిశాల‌మైన రెండు హాళ్లు, 12కు పైగా బాత్రూమ్‌ల‌తో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆదివారం తెల్ల‌వారు జామున ఈ ఇంటికి గృహ ప్ర‌వేశం కూడా నిర్వ‌హించారు.

అయితే.. ఇదేమీ అనుకుని నిర్మించిన భ‌వ‌నం కాదు. గ‌త ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయ‌కులు చేసిన యాగీ.. పెట్టిన పోరు ఫ‌లితంగా.. దాదాపు 35 ఏళ్ల త‌ర్వాత‌.. చంద్ర‌బాబు నిర్మించుకున్న సొంతిల్లు. కుప్పం నుంచి చంద్ర‌బాబు ప్ర‌తి ఎన్నిక‌లోనూ విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. కానీ, ఆయ‌న‌కు సొంతిల్లు లేదు. ఎప్పుడు ఇక్క‌డ‌కు వ‌చ్చినా.. నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి అయినా.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న సొంతిల్లు మాత్రం ఇక్క‌డ లేదు.

ఎప్పుడు వ‌చ్చినా స్థానికంగా హోట‌ల్‌లో బ‌స చేసేవారు. అస‌లు సొంతిల్లు క‌ట్టుకోవాల‌న్న ఆలోచ‌న కూడా ఆయ‌న‌కు రాలేదు. కానీ.. వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును ఈ కార‌ణంతోనే ఆ పార్టీ నాయ‌కులు ఏకేశారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇల్లు లేని ముఖ్య‌మంత్రి అంటూ.. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌పై మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు అంత‌ర్మ‌థ‌నం చెందేవ‌రు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఆయ‌న స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి.. 2023లో సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వైసీపీ నాయ‌కుల విమ‌ర్శ‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని.. ఇంటి నిర్మాణాన్ని ఆమె స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. వారానికి రెండు రోజుల పాటు కుప్పంలో మ‌కాం వేసిన భువ‌నేశ్వ‌రి.. ఇంటి ప‌నులను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. ఇలా.. వ‌డివ‌డిగా సాగిన ఇంటి నిర్మాణం తాజాగా పూర్త‌యింది. రెండు లిఫ్టులు.. విశాల‌మైన పార్కింగ్ స‌దుపాయాలు.. ఎక్క‌డిక‌క్క‌డ లాన్‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారు. మొత్తానికి మూడు ద‌శాబ్దాల క‌ల నెర‌వేర‌డంతోపాటు.. వైసీపీ నాయ‌కుల నోటికి కూడా భువ‌నేశ్వ‌రి తాళం వేశారు.