పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు పాక్ వెన్నులో వణుకు పుట్టించాయి. అదే సమయంలో ఉగ్రవాదుల తూటాలకు బలి అయిన అమాయకుల కుటుంబాలు మాత్రం ఈ దాడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పహల్ గాం ఉగ్ర దాడిలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మధుసూదన్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ ను ఆయన సతీమణి కామాక్షి కళ్లెదుటే ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట చేసిన ఈ సైనిక దాడులపై తాజాగా కామాక్షి స్పందించారు. వాస్తవానికి తన కల్లెదుటే భర్తను కోల్పోయిన కామాక్షి మాట్లాడే పరిస్తితిలో కూడా లేరనే చెప్పాలి. అయినా కూడా ఆమె స్పందించడం గమనార్హం.
పహల్ గాం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా మన దేశ సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట వైమానిక దాడులు చేసిన వైనం తమకు సంతోషాన్ని కలిగించిందని కామాక్షి తెలిపారు. ఈ దాడులు తన భర్తతో పాటు బాధిత 26 కుటుంబాల తరఫున ప్రతీకారం తీర్చుకున్నట్లేనని ఆమె అన్నారు. తమ ప్రతీకారాన్ని భుజాన వేసుకుని ఆపరేషన్ సిందూర్ జరిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్స్ మోదీజీ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ అంటే… భర్తలను కోల్పోయిన తమ లాంటి బాధితుల జరిపిన దాడులే ఇవని కామాక్షి అన్నారు. ఆపరేషన్ సిందూర్ దెబ్బతో మరోమారు భారత్ పై దాడులు చేయాలంటేనే ఉగ్రవాదులు భయపడే పరిస్థితిని మోదీ తీసుకువచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం మధుసూదన్ కుమారుడు కూడా మీడియాతో మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ గురించి టీవీల్లో చూశానని, ఈ దాడులతో ఇకపై పెహల్ గాం లాంటి దాడులు జరగవనే అనుకుంటున్నానని అతడు పేర్కొన్నాడు.