కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న గోల్డెన్ అవర్ ఉచిత వైద్యాన్ని అమలులోకి తీసుకొస్తూ నరేంద్ర మోదీ సర్కారు… సోమవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సోమవారం రాత్రి నుంచే ఈ కొత్త పథకం అమలులోకి వచ్చేసినట్టుగా కూడా కేంద్రం తన ఉత్తర్వుల్లో విస్పష్టంగా ప్రకటించింది. “క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం- 2025” గా పరిగణిస్తున్న ఈ పథకం కింద.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అప్పటికప్పుడు ఏకంగా రూ.1.5 లక్షల మేర ఉచిత వైద్యం అందనుంది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో (గోల్డెన్ అవర్)లో చికిత్స అందితే ప్రమాద బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ఆరంభంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ… రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ లో ఉచిత వైద్యానికి రూపకల్పన చేసింది. ఈ విషయంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా తీసుకున్న కేంద్రం..తాజాగా అన్నింటినీ పరిశీలించి ఈ పథకానికి తుది రూపు తీసుకొచ్చింది. అవే నిబంధనలతో సోమవారం రాత్రి ఈ పథకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకం కింద దేశంలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా… సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి బాధితులు ఉచితంగానే వైద్యం తీసుకునే వెసులుబాటు ఉంది. ట్రామా, పాలీ ట్రామా తరహా చికిత్సలు అందుబాటులో ఉండే అన్ని ఆసుపత్రులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఒకవేళ సమీపంలోని ఆసుపత్రిలో ఈ తరహా సౌకర్యాలు లేకపోతే… ఆయా ఆసుపత్రులే తమ సొంత అంబులెన్స్ లను ఇచ్చి సమీపంలోని మరో ఆసుపత్రికి తరలంచాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం అమలుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయం నుంచి వారం రోజుల పాటు బాధితులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన తర్వాత ఆయా ఆసుపత్రులు ఈ పథకం వెబ్ సైట్ లో వివరాలను పొందుపరచి ప్రభుత్వం నుంచి అందుకు సంబంధించిన నిధులను పొందవచ్చు.