రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సార్లు ఏపీకి వచ్చారు. అంటే.. కేవలం పది మాసాల వ్యవధిలోనే ప్రధాని మూడు సార్లు.. రాష్ట్రంలో పర్యటించారు. ఇదేమీ చిన్న విజయం కాదు. సొంతగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలకే ఆయన ఐదేళ్లలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే పర్యటిస్తున్నారు. అలాంటిది.. ఏపీలో పది మాసాలు కాకుండానే మూడు సార్లు వచ్చారు. తొలిసారి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వచ్చారు.
రెండోసారి విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చారు. ఇప్పుడు మూడోసారి అమరావతిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభించేందుకు వచ్చారు. ఇదంతా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఖాతాలోనే పడింది. వారి చొరవ, మోడీ దగ్గర వారికి ఉన్న అనుబంధం కారణంగానే ప్రధాని ఇలా కేవలం 10 నెలల కాలంలో ఏపీకి వచ్చారన్న చర్చ జరుగుతోంది. కానీ.. జగన్ హయాంలో ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే మోడీ వచ్చారు.
దీనికి కారణాలేంటి? అనేది సహజంగానే తెరమీదికి వస్తున్న ప్రశ్న. పాలన పరంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలేనని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి కేంద్రం నుంచి మంత్రులు , ప్రధాని ఒక రాష్ట్రానికి రావాలంటే.. వ్యక్తిగతంగా వారికి అవసరాలు ఉండాలి. అది ఎన్నికల సమయంలో తప్ప.. దీనికి ముందు.. తర్వాత.. వారికి ఉండవు. ఇక, రెండోది.. పాలన పరంగా రాష్ట్రంలో కొంత మెరుగైన తీరు కనిపించాలి. ఇదే ఇప్పుడు ఏపీకి ప్రధానిని వచ్చేలా చేసిందని అంటున్నారు.
జగన్ పాలనను తీసుకుంటే.. జాతీయ స్థాయి వరకు.. ఆయన తీసుకున్న మిడిమేళపు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. మూడు రాజధానులు.. ఎస్సీలపై దాడులు చేసి.. వారిపైనే ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం.. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అదే గొప్ప అని భావించడం.. ప్రజల మధ్యకు రాకుండా.. తాడేపల్లికే పరిమితం కావడం వంటివి ప్రధాని మోడీకి కూడా చిరాకు తెప్పించాయి.
అయితే.. ఆయన ఎక్కడా నేరుగా విమర్శించకపోయినా.. మనసు మాత్రం పెట్టలేక పోయారు. అందుకే జగన్ హయాంలో కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చి.. వెళ్లిపోయారని.. కానీ.. కూటమి సర్కారు చేస్తున్న పాలన, పెట్టుబడుల ఆకర్షణ,జవాబుదారీ తనం వంటివి మోడీని ఆకర్షిస్తున్నాయని.. అందుకే.. ఆయన ఇన్ని సార్లు ఏపీలో పర్యటించారని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates