తాజాగా జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో.. ఏపీ వాసులు సహా 26 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఒకవైపు కేంద్రం తీవ్రంగా చర్యలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో అంతర్గతంగా బీజేపీ నాయకులు.. ఈ దాడిని ఖండిస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వహించారు.
అయితే.. వీరికి మించిన రీతిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజృంభించారు. నేరుగా ఆయన పేరు పెట్టి అనకపోయినా.. పాకిస్థాన్‌ను సమర్థించేవారిని దేశం వదిలి వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు కరుడుగట్టిన బీజేపీ నాయకులు కూడా చేయకపోవడం గమనార్హం. అంతేకాదు.. పాకిస్థాన్ విషయంలో పవన్ చాలా సూటిగా సుత్తి లేకుండా స్పందించారు.
మృతుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే ఉగ్రదాడుల ఘటనలపై పవన్ చేసిన వ్యాఖ్యలు.. జాతీయస్థాయిలో ప్రచారం, ప్రసారం కూడా అయ్యాయి. దీంతో జాతీయస్థాయిలో పవన్ ఇమేజ్ మరింత పెరిగింది. వివిధ భాషలకు చెందిన బీజేపీ అనుకూల చానెళ్లు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన చానెళ్లు కూడా.. పవన్ వ్యాఖ్యలను షేర్ చేయడం , బీజేపీ సోషల్ మీడియాలోనూ పవన్ వ్యాఖ్యలు.. మరింత మంది ఎక్కువగా షేర్ చేయడంతో ఇప్పుడు పవన్ పేరు జోరుగా వినిపిస్తోంది.
ఈ క్రమంలో కేంద్రంలోని పెద్దలు కూడా.. పవన్ చేసిన వ్యాఖ్యలను హిందీలోకి తర్జుమా చేయించుకుని విన్నారని తెలిసింది. దీనికి ఆయనకు అభినందనలు కూడా తెలిపినట్టు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నా.. అనుకున్న విధంగా పాక్ విషయంలో స్పందన లేకుండా వ్యవహరించడంతో .. పవన్ ఈ పార్టీని ఓవర్ టేక్ చేసిన విధంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో తిరుమల వ్యవహారం, తిరుపతి తొక్కిసలాటపైనా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates