వైసీపీ.. ‘వెంట్రుక’ భాష‌లు.. మారితే మంచిది!

ఒక‌సారి త‌ప్పు చేయొచ్చు.. రెండుసార్లు త‌ప్పు చేయొచ్చు. కానీ, ప‌దే ప‌దే అదే త‌ప్పులు చేస్తే.. ప్ర‌జ‌ల్లో మ‌రింత చుల‌క‌న‌వుతారు. ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఏవ‌గించుకుంటారు. మ‌రి ఈ విష‌యం వైసీపీ నాయ‌కుల‌కు తెలుసో.. తెలియ‌దో.. కానీ, ఇప్ప‌టికీ వారిలో మార్పు క‌నిపించ‌డం లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. నోటికి ఎంత మాట ప‌డితే అంత మాట మాట్లాడారు. బూతుల మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ప్ర‌జలు ఛీత్క‌రించుకున్నారు. ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లో 11 సీట్లు మాత్ర‌మే ఇచ్చారు.

అయినా.. వైసీపీ నాయ‌కుల్లో మార్పు రావ‌డం లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఎలా అయితే.. నోరు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో నోరు చేసుకుంటున్నారు. మ‌ళ్లీ వెంట్రుక భాష‌ల‌నే మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ మ‌రోసారి తాజాగా ఈ భాష‌నే వాడారు. వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఎన్నుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. త‌మ‌పై ఎన్ని కేసులు పెట్టుకున్నా జ‌డిసేది లేద‌న్నారు.

అంతేకాదు.. త‌మ‌పై ఎన్ని కేసులు పెట్టినా.. త‌మ వెంట్రుక కూడా పీక‌లేర‌ని గోరంట్ల వ్యాఖ్యానించారు. గతంలో ఎంపీగా ఉన్న స‌మ‌యంలో కూడా గోరంట్ల ఇలానే వ్యాఖ్యానించారు. పీకుడు భాష కార‌ణంగానే మాజీ మంత్రి కొడాలి నానీ కూడా బ‌ద్నాం అయ్యారు. అదేవిధంగా గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా పీకుడు-వెంట్రుక భాష‌ల‌నే వినియోగించారు. ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గంలోను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ బ‌ద్నాం అయింది. మ‌రి ఇప్పుడు కూడా.. తీరు మార‌క‌పోతే.. ప్ర‌జ‌లు ఏమేర‌కు హ‌ర్షిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌.